ఏఐ ఏజెంట్‌ వస్తోంది.. | Artificial Intelligence breakthroughs are transforming smartphones | Sakshi
Sakshi News home page

ఏఐ ఏజెంట్‌ వస్తోంది..

Jun 8 2026 4:44 AM | Updated on Jun 8 2026 4:44 AM

Artificial Intelligence breakthroughs are transforming smartphones

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఒక చరిత్రాత్మక మార్పునకు సిద్ధమవుతోంది. ఇకపై వినియోగదారులు మొబైల్‌ అప్లికేషన్ల (యాప్స్‌) ద్వారా కాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఏజెంట్ల ద్వారా నేరుగా తమ డివైస్‌లతో ఇంటరాక్ట్‌ అయ్యే రోజులు రానున్నాయి. ఈ సరికొత్త ఏజెంటిక్‌ విప్లవంలో పైచేయి సాధించేందుకు టెక్‌ దిగ్గజాలు గూగుల్, ఓపెన్‌ ఏఐ హోరాహోరీగా తలపడుతున్నాయి.

ఆండ్రాయిడ్‌ ఇక ఏఐ సిస్టమ్‌
గూగుల్‌ తాజాగా నిర్వహించిన ఆండ్రాయిడ్‌ షో 2026 వేదికగా గూగుల్‌ జెమినై ఇంటెలిజెన్స్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ కోసం రూపొందించిన ఒక శక్తివంతమైన ఏఐ లేయర్‌. కేవలం ఒక ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా ఉన్న ఆండ్రాయిడ్‌ను, పూర్తిస్థాయి ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌గా మార్చడమే దీని లక్ష్యమని గూగుల్‌ ప్రకటించింది. వినియోగదారుడి అవసరాలను, సందర్భాన్ని ముందే ఊహించి, వివిధ యాప్‌ల ద్వారా పనులను ఇది స్వయంచాలకంగా పూర్తి చేస్తుంది. ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్న శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌26, గూగుల్‌ పిక్సెల్‌ 10 సిరీస్‌ ఫోన్లలో ఈ ఫీచర్లు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి.

రూ. 53 వేల కోట్ల డీల్‌తో ఓపెన్‌ ఏఐ భారీ వ్యూహం
మరోవైపు యాపిల్‌ మాజీ ఐకానిక్‌ డిజైనర్‌ జోనీ ఐవ్‌తో కలిసి ఓపెన్‌ ఏఐ ఒక సరికొత్త ఏఐ–కేంద్రిత స్మార్ట్‌ఫోన్‌ను రికార్డు స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. కంప్యూటింగ్‌ ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్వచించే లక్ష్యంతో స్క్రీన్‌లు, సంప్రదాయ యాప్‌ల అవసరం లేకుండా కేవలం ఏఐ ఇంటరాక్షన్‌తో నడిచే సరికొత్త డివైస్‌లను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జోనీ ఐవ్‌కు చెందిన స్టార్టప్‌ ‘ఐఓ’ను ఓపెన్‌ ఏఐ సంస్థ మును­పెన్నడూ లేని విధంగా సుమారు రూ. 53 వేల కోట్ల భారీ డీల్‌తో కైవసం చేసుకుంది. హార్డ్‌వేర్‌ రంగంలో ఓపెన్‌ ఏఐ వేసిన అతిపెద్ద అడుగుగా ఇది నిలిచింది.స్క్రీన్‌ ట్యాపింగ్, స్వైపింగ్‌ ఇక గతం

ఇటీవల ప్రచురితమైన యాప్‌ ఏజెంట్‌ 
మల్టీమోడల్‌ ఏజెంట్స్‌ యాజ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌ అనే పరిశోధనా పత్రం ప్రకారం ఏఐ ఏజెంట్లు మనుషుల తరహాలోనే స్క్రీన్‌పై ట్యాప్‌ చేయడం, స్వైప్‌ చేయడం ద్వారా యాప్‌లను స్వతంత్రంగా ఆపరేట్‌ చేయగల సామర్థ్యాన్ని సాధించాయి. కిరాణా సామగ్రి ఆర్డర్‌ చేయడం, దరఖాస్తులు నింపడం, అపాయింట్‌మెంట్‌లు బుక్‌ చేయడం వంటి పనులను ఈ ఏజెంట్లు వినియోగదారుడి ప్రమేయం లేకుండానే పూర్తి చేయగలవు.

ముఖ్యమైన మార్పులు ఇవీ..
పూర్తి ఆటోమేషన్‌: ఒకే ఒక కమాండ్‌తో మల్టీ–స్టెప్‌ పనులను పూర్తి చేయగల ఏఐ.
కాంటెక్ట్స్‌ అవేర్‌నెస్‌: యూజర్‌ లొకేషన్, బిహేవియర్, ఆన్‌–స్క్రీన్‌ యాక్టివిటీ ఆధారంగా ముందస్తు సూచనలు.
పరిధి విస్తరణ: ఫోన్లకే పరిమితం కాకుండా భవిష్యత్తులో స్మార్ట్‌ వాచీలు, కార్లు, ల్యాప్‌టాప్‌లలోకి జెమిని ఇంటెలిజెన్స్‌.

భారత్‌పై ప్రభావం!
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ అయిన భారతదేశంపై ఈ మార్పు తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో ఆండ్రాయిడ్‌ మార్కెట్‌ వాటా అత్యధికంగా ఉండటమే కాకుండా శామ్‌సంగ్, షావోమి, వన్‌ప్లస్‌ వంటి బ్రాండ్ల ద్వారా ఏఐ ఫోన్లకు భారత్‌ అత్యంత కీలకమైన వృద్ధి కేంద్రంగా మారింది. వచ్చే వారం జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక గూగుల్‌ ఐ/ఓ 2026 సదస్సులో ఆండ్రాయిడ్‌ 17, జెమినై ఏఐ, ఆండ్రాయిడ్‌ ఎక్‌ఆర్‌ డివైస్‌లకు సంబంధించిన మరిన్ని సంచలన అప్‌డేట్‌లను గూగుల్‌ ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement