చిన్న షేర్లు కుదేల్‌!

Smallcap index down 6 percent in 2022-23 - Sakshi

2022–23లో స్మాల్‌క్యాప్‌ సూచీ 6 శాతం డౌన్‌..

సెన్సెక్స్, బ్లూచిప్‌ షేర్లతో పోలిస్తే అధిక పతనం

అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం

న్యూఢిల్లీ: చిన్న షేర్లు చితికిపోయాయి. ఒకపక్క ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి తోడు వడ్డీరేట్లకు రెక్కలు రావడం, అధిక ద్రవ్యోల్బణం సెగ వాటికి బాగానే తగిలింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో స్మాల్‌క్యాప్‌ సూచీ 1,617 పాయింట్లు (5.73%) దిగజారడం దీనికి నిదర్శనం. ఇదే కా లంలో బీఎస్‌ఈ సెన్సెక్స్, బ్లూచిప్‌ షేర్లతో పోలిస్తే చిన్న షేర్ల పతనం భారీగా ఉండటం గమనార్హం.

తీవ్ర ఒడిదుడుకులు...
2022–23 ఏడాది భారత స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగానే కుదిపేసింది. ప్రధానంగా తొలి క్వార్టర్‌లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో దేశీ సూచీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయని.. అయితే, రెండు, మూడు త్రైమాసికాల్లో తిరిగి పుంజుకోగలిగాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేషించారు. అయితే, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటు ధరాభారం, అధిక వడ్డీరేట్ల వల్ల చిన్న షేర్లపై ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లిందని వారు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఒక్క రోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో, గడిచిన ఏడాది కాలాన్ని చూస్తే... మిడ్‌ క్యాప్‌ సూచీ 1.12 శాతం (270 పాయింట్లు) మాత్రమే తగ్గగా, సెన్సెక్స్‌ 1.03 శాతం (608 పాయింట్లు) పడింది.

‘‘ధరల కట్టడే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులన్నీ వడ్డీరేట్లను జోరుగా పెంచడం మొదలుపెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు రిస్క్‌ తగ్గించుకోవడంపై దృష్టిపెట్టడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది‘‘ అని మార్కెట్స్‌మోజో చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సునీల్‌ దమానియా విశ్లేషించారు. కాగా, 2021–22లో మార్కెట్లు దుమ్మురేపడంతో స్మాల్‌ క్యాప్‌ సూచీ ఏకంగా 36.64 శాతం దూసుకెళ్లడం తెలిసిందే. ఇదే బాటలో మిడ్‌క్యాప్స్‌ 19.45 శాతం సెన్సెక్స్‌ 18.29 శాతం చొప్పున బలపడ్డాయి. ఏడాది తిరిగేసరికి చిన్న షేర్లు మళ్లీ వేగంగా కరిగిపోవడం గమనార్హం. ప్రధానంగా వడ్డీరేట్ల పెరుగుదలతో చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు వడ్డీభారం పెరగడం వల్ల పెద్ద కంపెనీలతో పోలిస్తే అధిక ప్రభావం కనబడుతోందని దమానీ పేర్కొన్నారు.

చిన్న షేర్లకు దూరం...
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇన్వెస్టర్లు చిన్న షేర్లను అధిక రిస్క్‌తో కూడినవిగా పరిగణిస్తున్నారని స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా చెప్పారు. దీంతో వీటిలో పెట్టుబడులకు వెనుకాడటంతో పాటు తమ సొమ్మును వేగంగా వెనక్కి తీసుకోవడం వల్ల స్మాల్‌క్యాప్‌ సూచీ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా పడిందన్నారు. ఫెడ్‌ భారీగా వడ్డీరేట్లను పెంచడం, ఉక్రెయిన్‌ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణంతో మాంద్యం భయాలు నెలకొన్న కారణంగా గడిచిన ఏడాది కాలం మన మార్కెట్లు గడ్డు పరిస్థితులను చవిచూశాయని మాస్టర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అర్విందర్‌ సింగ్‌ నందా పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తిరోగమనం, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో ఎడాపెడా అమ్మకాల వంటి అనేక అంశాలు కూడా మన మార్కెట్‌ ప్రతికూల పనితీరుకు కారణమని నందా అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top