'కుషాక్‌' తో స్కోడా సేల్స్‌ జోరు.. విర‌గ‌బ‌డి కొంటున్న జనం

Skoda Auto Registers 234 Percent Increase In July Sales For Kushaq - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా..జూలై నెలలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో 234 శాతం వృద్ధి నమోదు చేసింది. 2021 జూన్‌తో పోలిస్తే 320 శాతం వృద్ధి సాధించింది. గత నెలలో కంపెనీ దేశవ్యాప్తంగా 3,080 కార్లను విక్రయించింది. 2020 జూలైలో ఈ సంఖ్య 922 మాత్రమే. ఈ ఏడాది జూన్‌లో కొత్తగా 734 కార్లు మాత్రమే రోడ్డెక్కాయి. 

జూలై అమ్మకాల జోరుకు కుషాక్‌ మోడల్‌ కీలకమని కంపెనీ బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ తెలిపారు. ఆవిష్కరించిన నెలరోజుల్లోనే సుమారు 6,000  బుకింగ్స్‌ను కుషాక్‌ సొంతం చేసుకుందని చెప్పారు. కొత్తగా డీలర్‌షిప్‌ కేంద్రాల ఏర్పాటుకు 200 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గత నెలలో నెట్‌వర్క్‌ 15 శాతం విస్తరించినట్టు పేర్కొన్నారు.  

కుషాక్‌ ఫీచర్స్‌
స్కోడా  తన కొత్త మోడల్‌ కుషాక్‌ ఎస్‌యూవీని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.  ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా తయారయ్యే తొలి ఉత్పత్తిగా కుషాక్‌ విడుదలై ఎస్‌యూవీ విభాగంలోని హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌ మోడళ్లకు సరికొత్త కుషాక్‌ పోటీ ఇచ్చింది. అందుకు కారణం ఆ కారు ఫీచర్లేనని మార్కెట్‌ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఆ కారు ఫీచర్లు ఎలా ఉన్నయో తెలుసుకుందాం. 

రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో  ఇది లభ్యం. బేస్‌ వేరియంట్‌లో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను జత చేసింది. ఇ‍క టాప్-ఆఫ్-లైన్ మోడల్‌ ఎస్‌యూవీలో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది.1.5-లీటర్  వేరియంట్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 147.5 బిహెచ్‌పి మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ను టార్క్ అందిస్తుంది. 1.0-లీటర్ ఇంజన్  వేరియంట్‌ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 114 బిహెచ్‌పి పవర్, 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 

హనీ ఆరెంజ్, టోర్నడో రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్, కార్బన్ స్టీల్ అనే ఐదు కలర్ వేరియంట్లలో లభ్యం. నాలుగు సంవత్సరాల / 1,00,000కిలోమీటర్ల వారంటీతో పూర్తి “పీస్ ఆఫ్ మైండ్” మీ సొంతం అంటోంది.  దీన్ని  ఆరు సంవత్సరాల వరకు లేదా, 1,50,000 కిమీ వరకు  పొడిగించుకోవచ్చు. అంతేకాదు  2 సంవత్సరాల పార్ట్స్ వారంటీ, 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల పెయింట్ వారంటీ, 6 సంవత్సరాల తుప్పు వారంటీ 9 సంవత్సరాల వరకు విస్తరించిన రోడ్‌సైడ్  అసిస్టెన్స్‌ ప్రోగ్రాం కూడా అందిస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top