షార్ట్‌ కవరింగ్‌ లాభాలు

 Sensex, Nifty end flat amid volatility - Sakshi

కలిసొ చ్చిన ఆఖర్లో కొనుగోళ్లు    

17,100 చేరువలో నిఫ్టీ ముగింపు 

సెన్సెక్స్‌ లాభం 346 పాయింట్లు  

శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు 

ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు మార్చి సిరీస్‌కు లాభాలతో వీడ్కోలు పలికాయి. ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్ల జరగడంతో బుధవారం సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కొలిక్కి వస్తుండంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో  సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఉదయం మార్కెట్‌ ప్రారంభమైన తర్వాత మిడ్‌ సెషన్‌ వరకు సూచీలు స్థిరంగా కదలాడాయి. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా.., చివరి గంటలో కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరు పెరగడంతో లాభాలు పెరిగాయి.

ఉదయం సెన్సెక్స్‌ 41 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,613 మొదలైంది. ఇంట్రాడేలో 57,524 వద్ద కనిష్టాన్ని, 58,124 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 346 పాయింట్లు ఎగసి 57,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు పతనమై 16,952 వద్ద మొదలైంది. రోజంతా 16,941 – 17,126 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 129 పాయింట్ల లాభంతో 17,081 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లకు డిమాండ్‌ నెలకొంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు అధికాస్తకి చూపారు. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి.  

ఎఫ్‌పీఐలు రూ.1,245 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.823 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 15 పైసలు క్షీణించి 82.31 స్థాయి వద్ద స్థిరపడింది. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి శుక్రవారం ప్రారంభమవుతాయి. సూచీలు అరశాతానికి పైగా ర్యాలీ చేయడంతో బీఎస్‌ఈలో రూ.3.12 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఆసియా మార్కెట్లు ఒకశాతం, యూరప్‌ మార్కెట్లు ఒకటిన్నర శాతం పెరిగాయి.

యూఎస్‌ స్టాక్‌ సూచీలు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.    ‘‘ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుందనే స్పష్టం వచ్చేంత వరకు, బ్యాంకింగ్‌ రంగంలో అనిశ్చితులు సంపూర్ణంగా సద్దుమణిగే దాకా ఒడిదుడుకులు తప్పవు. సాంకేతికంగా నిఫ్టీ గత 5 రోజుల్లో గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఎగువన 17,207–17,255 శ్రేణిలో నిరోధాన్ని, దిగువ స్థాయిలో  16,985 వద్ద తక్షణ మద్దతు ఏర్పాటు చేసుకుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.
 
మార్కెట్లో మరిన్ని సంగతులు  
కెన్‌ తన నివేదికలో నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు చేసిందంటూ అదానీ గ్రూప్‌ వివరణతో ఈ కంపెనీల షేర్లు ర్యాలీ చేశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తొమ్మిది శాతం, అదానీ పోర్ట్స్‌ ఏడుశాతం లాభపడ్డాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్‌డీటీవీ షేర్లు ఐదుశాతం ఎగసి అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద లాకయ్యాయి.  
ఇండస్‌ఇండ్‌ బ్యాంకుతో వివాదాలను పరిష్కరించుకున్నామని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ తెలపడంతో జీ మీడియా షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 2% బలపడి రూ.1,056 వద్ద నిలిచింది. 
♦ బైబ్యాక్‌ ఇష్యూలో పాల్గొనేందుకు అర్హత తేదీ ముగియడంతో సింఫనీ షేరు ఆరు శాతం పతనమైన రూ.1023 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top