చివర్లో లాభాల స్వీకరణ

Sensex gives up 48832 points, Nifty below 14,650 - Sakshi

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ఐటీ, ఫార్మా, ఆటో షేర్లలో కొనుగోళ్లు

బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అమ్మకాలు 

సెన్సెక్స్‌ లాభం 28 పాయింట్లు 

14,600 పైకి నిఫ్టీ  

ముంబై: చివరి గంటలో లాభాల స్వీకరణ జరగడంతో శుక్రవారం సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 28 పాయింట్ల లాభంతో 48,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 14,618 వద్ద నిలిచింది. సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. ఐటీ, ఫార్మా, ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్, ఆర్థిక, రియల్టీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను దేశీయ మార్కెట్‌ అందిపుచ్చుకోలేకపోయింది. కోవిడ్‌ కేసుల భయాలు కొనసాగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 395 పాయింట్ల పరిధిలో కదలాడగా, నిఫ్టీ 138 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

‘‘రెండో దశలో కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌ భయాలతో ఈ ఏప్రిల్‌ ప్రథమార్థంలో దేశీయ మార్కెట్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్‌ వైఖరి ప్రదర్శించారు. మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టానికి ఎగిసినట్లు ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. ఈ అంశాలన్నీ మార్కెట్‌ ముందుకు కదిలిందుకు అడ్డుగా నిలిచాయి. అయితే వేగవంతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ విధింపులతో వ్యాధి సంక్రమణ రేటు క్షీణించే అవకాశం ఉంది. అప్పుడు మార్కెట్‌లో ర్యాలీ తిరిగి ప్రారంభవుతుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్స్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.438 కోట్ల విలువైన షేర్లను, సంస్థాగత(దేశీయ) ఇన్వెస్టర్లు రూ.658 షేర్లు కొన్నారు. నాలుగు రోజులు ట్రేడింగ్‌ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్‌ 759 పాయింట్లు, నిఫ్టీ 217 పాయింట్లు లాభపడ్డాయి.  

మెరుగైన ఫలితాలతో విప్రో  దూకుడు...
మార్చి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడం టెక్‌ దిగ్గజం విప్రో షేరు తొమ్మిది శాతం లాభపడి రూ.469 వద్ద ముగిసింది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ ఒక్కరోజులోనే రూ.10,778 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను ఆర్జించింది. ఇంట్రాడేలో పది శాతం ఎగసి రూ.473 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. గత ఆర్థిక సంవత్సరపు క్యూ4(జనవరి– మార్చి)లో విప్రో నికరలాభం 28 శాతం వృద్ధి చెంది రూ.2,972 కోట్లను ఆర్జించింది. రాబోయే త్రైమాసికాల్లో కూడా ఇదే పనితీరును కనబరుస్తామని యాజమాన్యం ధీమాను వ్యక్తం చేయడంతో ఇన్వెస్టర్లు విప్రో షేరును కొనేందుకు ఆసక్తి చూపారు.  

సోమవారం మాక్రోటెక్‌ డెవలపర్స్‌ లిస్టింగ్‌...  
ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకున్న రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం మాక్రోటెక్‌ డెవలపర్స్‌ షేర్లు సోమవారం లిస్టింగ్‌ కానున్నాయి.  గతంలో లోధా డెవలపర్స్‌ పేరుతో కార్యకలాపాలు నిర్వహించిన ఈ కంపెనీ ఐపీఓ ఈ ఏప్రిల్‌ 7న మొదలై 9న ముగిసింది. ఐపీఓ ధర శ్రేణిని రూ. 483–486గా నిర్ణయించి మొత్తం  రూ.2,500 కోట్లు సమీకరించింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
► ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కంపెనీలో వాటాను పెంచుకోవడంతో ఎంసీఎక్స్‌ కంపెనీ షేరు 2% పెరిగి రూ.1495 వద్ద స్థిరపడింది.  
► బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు వరుసగా మూడోరోజూ ర్యాలీ చేసింది. బీఎస్‌ఈలో 7% లాభంతో రూ.966 వద్ద నిలిచింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top