
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను సెబీ ముందుకు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమలైతే అప్పుడు రీట్, ఇన్విట్‌లలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.
తద్వారా వీటిల్లో లిక్విడిటీ మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం ఒక ఫండ్ ఎన్‌ఏవీలో గరిష్టంగా 10 శాతం మేరే రీట్, ఇన్విట్‌లలో పెట్టుబడులకు అనుమతి ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్‌కు 20 శాతానికి ప్రతిపాదించింది. మే 11 వరకు ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని సెబీ కోరింది.
ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లోకి యాక్సిస్ మ్యుచువల్ ఫండ్
ఫండ్స్‌లో పెట్టుబడులను సులభతరం చేసే దిశగా ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)లో చేరినట్లు యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ వెల్లడించింది. దీనితో అంతగా ఆర్థిక సేవలు అందుబాటులో లేని, మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా సరళతరంగా, తక్కువ వ్యయాలతో తమ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుందని సంస్థ ఎండీ బి. గోప్‌కుమార్ తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో యాక్సిస్ ఎంఎఫ్ చేరడమనేది అందరికీ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్య సాకారానికి తోడ్పడుతుందని ఓఎన్‌డీసీ ఎండీ టి. కోషి చెప్పారు.