కార్వీ కేసులో ‘షాక్‌’ ఎక్స్చేంజీలు

Sebi penalises NSE, BSE for laxity in Karvy Stock Broking case - Sakshi

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈకి జరిమానా

మార్కెట్ల నియంత్రణ సంస్థ ఆదేశం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) కేసులో సంచలనం. స్టాక్‌ ఎక్స్చేంజీలకు షాక్‌ తగిలేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన సెక్యూరిటీల దుర్వినియోగాన్ని గుర్తించే విషయంలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వైఫల్యాన్ని సెబీ ఎత్తి చూపింది.

ఈ మేరకు బీఎస్‌ఈకి రూ.3 కోట్లు, ఎన్‌ఎస్‌ఈకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. 95,000లకుపైగా క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల సెక్యూరిటీలను కేవలం ఒక డీమ్యాట్‌ ఖాతా నుండి తాకట్టు పెట్టి కార్వీ దుర్వినియోగం చేసిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీలను తాకట్టు పెట్టి కేఎస్‌బీఎల్, గ్రూప్‌ కంపెనీలు 8 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.851.43 కోట్ల రుణం పొందాయి. నిస్సందేహంగా ఖాతాదారుల సెక్యూరిటీలను అనధికారికంగా తాకట్టు పెట్టడం ద్వారా కేఎస్‌బీఎల్‌ దుర్వినియోగానికి పాల్పడిందని సెబీ స్పష్టం చేసింది. 

నష్టానికి కార్వీదే బాధ్యత..: ‘పెట్టుబడిదారులకు, అలాగే రుణం ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నష్టంతో సహా.. సొంతం కాని సెక్యూరిటీలను తాకట్టు పెట్టడం వల్ల కలిగే నష్టానికి కేఎస్‌బీఎల్‌ బాధ్యత వహిస్తుంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో సభ్యుడిగా ఉండటంతో స్టాక్‌ ఎక్స్చేంజీల నియంత్రణ పర్యవేక్షణలో కార్వీ ఉంది. ఎక్స్చేంజీల వైఫల్యం ఉంది. ఫలితంగా కేఎస్‌బీఎల్‌లో జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించడం జరిగింది. ఈ విషయంలో స్టాక్‌ ఎక్స్చేంజీలు జవాబుదారీగా ఉండాలి’ అని సెబీ తన ఉత్తర్వుల్లో ఘాటుగా స్పందించింది. జూన్‌ 2019 నుండి కార్వీలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, సెబీ సంయుక్తంగా తనిఖీ నిర్వహించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top