పీఏసీఎల్‌ కేసులో రిఫండ్స్‌ షురూ

Sebi panel asks certain investors to submit original documents for refund - Sakshi

ఒరిజనల్‌ సర్టిఫికెట్ల దాఖలు గడువు మార్చి 20

న్యూఢిల్లీ: పీఏసీఎల్‌ గ్రూప్‌లో నష్టపోయిన ఇన్వెస్టర్లు మార్చి 20లోగా ఒరిజనల్‌ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసిందిగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ తాజాగా స్పష్టం చేసింది. తద్వారా అర్హతగల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. రూ. 15,001–17,000 మధ్య క్లెయిము చేస్తున్న ఇన్వెస్టర్లకు ఒరిజనల్‌ పత్రాల పరిశీలన తదుపరి రిఫండ్‌లను చేపట్టనున్నట్లు వివరించింది.

ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ఇన్వెస్టర్లు ఒరిజనల్‌ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసి ఉంటుందని వెబ్‌సైట్‌లో సెబీ పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత కమిటీ పీఏసీఎల్‌ ఆస్తుల విక్రయం, ఇన్వెస్టర్ల రిఫండ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇప్పటికే రిఫండ్‌ల ప్రాసెస్‌ను దశలవారీగా చేపట్టింది.

అర్హతగల ఇన్వెస్టర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా పీఏసీఎల్‌ రిజిస్టర్డ్‌ పత్రాలు దాఖలు చేయవలసిందిగా తెలియజేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు 2016లో సెబీ కమిటీ ఏర్పాటైంది. ఒరిజనల్‌ సర్టిఫికెట్ల దాఖలును 2023 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20వరకూ అనుమతిస్తారు. వ్యవసాయం, రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ పేరుతో పీఏసీఎల్‌ (పెరల్‌ గ్రూప్‌) పబ్లిక్‌ నుంచి రూ. 60,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఈ నిధులను 18ఏళ్లపాటు చట్టవిరుద్ధ పథకాల ద్వారా సమీకరించినట్లు సెబీ గుర్తించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top