2021 ‘రోబో’రేటరీ!.. టాప్‌-10 మేటి రోబోలపై ఓ లుక్కేయండి             

Roundup 2021: World Wide Famous Top Ten Robots - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానురాను ప్రతి పనిలోనూ రోబోల వినియోగం పెరుగుతోంది. ఇంట్లో చేసే పని దగ్గర్నుంచి పరిశ్రమల్లో పనుల దాకా మర మనుషుల వాడకం ఎక్కువవుతోంది. అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సరికొత్త రోబోలను సృష్టిస్తున్నారు. అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇలా రకరకాల రోబోలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. సంచలనాలు నమోదు చేశారు. మరి ఈ ఏటి మేటి రోబోల్లో టాప్‌–10 ఏంటో ఓ లుక్కేస్తారా!

అంగారకుడైనా.. తిరగడం ఆపుతానా? 
అంగారకుడిపై పరిశోధనల కోసం నాసా సిద్ధం చేసిన రోబో హెలికాప్టర్‌ ‘ఇన్‌జెన్యునిటీ’ఈ ఏటి మేటి రోబోగా చెప్పుకోవాలి. భూమిని దాటి ఇంకో గ్రహంపై సొంతంగా ఎగిరిన తొలి వాహనం ఇదే కావడం ఒక్క విశేషం మాత్రమే. 1.8 కిలోల బరువు ఉండే ఇన్‌జెన్యుటీ దాదాపు వెయ్యి మీటర్ల దూరం ప్రయాణించగలదు. అంగారకుడిపై ఉన్న పలుచటి వాతావరణాన్ని కూడా చీల్చుకుని ఎగరగల శక్తిమంతమైంది కూడా. రిమోట్‌ కంట్రోల్‌ అవసరం లేకపోవడం కొసమెరుపు! 

వంటేదైనా.. వండిపెట్టేస్తా 
ఊ అంటే.. కావాల్సిన వంట వంటి పెట్టే రోబో వ్యవస్థ ఈ మోలీ! లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న మోలీ రోబోటిక్స్‌ తయారు చేసింది. సూప్‌తో మొదలు డెజర్ట్‌ వరకూ షడ్రుచులతో వంటకాలు సిద్ధం చేసేందుకు మోలీలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కావాల్సిన సరుకులను అందించడమే ఆలస్యం చెప్పిన వంటల్లా వండి పెడుతుంది. సరుకులు అయిపోయే విషయమూ ముందే సమాచారమిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసేలా నిర్దిష్ట కేలరీలతో వంటలు చేయడం, ఏ దేశపు రుచినైనా సిద్ధం చేయగలగడం మోలీలోని ఇతర విశేషాల్లో కొన్ని.  

మర మనిషి.. పని మనిషి 
ఇంట్లోని చెత్తాచెదారం ఊడవడం, తుడవడం, పాత్రలు తోమి పెట్టడం వంటి వాటి కోసం తయారైంది ఈ మనిషిని పోలిన రోబో. చైనా కంపెనీ ఉబ్‌ టెక్‌ తయారు చేసిన దీని పేరు ‘వాకర్‌ ఎక్స్‌’. మనిషి ఆకారం, చేతులు, వేళ్లు అన్నీ ఉన్న వాకర్‌ ఎక్స్‌ అన్ని రకాల వస్తువులను చాలా జాగ్రత్తగా పట్టుకోగలదు. సీసా మూత తెరిచి అందులోని పదార్థాన్ని గ్లాసుల్లో పోసి అందివ్వడం, మనిషితో సరదాగా లేదా సీరియస్‌గానైనా చదరంగం ఆడటం, అలసిపోతే ఒళ్లు పట్టి మసాజ్‌ కూడా చేయగలదు.  

తలకిందులున్నా.. పని చేస్తే పక్కా 
అంతర్జాతీయ కార్ల కంపెనీ టయోటా తయారు చేసిన రోబో పనిమనిషి ఇది. గబ్బిలంగా వేలాడుతున్నట్లు కనిపిస్తుంటుంది కానీ ఇంటి పనులన్నీ చక్కబెట్టగలదు. అందుకే ఇది ఇంట్లో ఉండే ఫర్నిచర్, ఇతర వస్తువులన్నింటినీ తప్పించుకుని పనిచేయడం కాకుండా పైకప్పు నుంచి వేలాడుతూ పని చేసేలా తయారు చేశారు. 2015లో సుమారు 7,400 కోట్ల రూపాయల పెట్టుబడితో మొదలైన టయోటా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. ఇంటి పనుల కోసమే వేర్వేరు రోబోలను తయారు చేస్తోంది. 

మహానటి..
మనిషిని, రోబోను వేరుచేసే ఒకే ఒక్క అంశం మన భావోద్వేగాలని ఒకప్పుడు చెప్పేవారు. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఈ భావోద్వేగాలను సూచించే ముఖ కవళికలను కూడా రోబోలు సమకూర్చుకున్నాయి. యూకేకు చెందిన ఇంజినీర్డ్‌ ఆర్ట్స్‌ అనే సంస్థ సిద్ధం చేసిన ‘అమికా’ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మేలుకో అంటే చాలు.. ఇది గందరగోళం, నిస్పృహ వంటి ఆరు రకాల భావాలను వ్యక్తం చేస్తుంది. చేతులు కాళ్లూ చూస్తూ నోరు తెరిచి ఆవలిస్తుంది. అంతేకాదు నవ్వు, ఆశ్చర్యం, కోపం వంటి అనేక భావాలను ముఖంలోనే పలికించగల మహానటి ఈ రోబో! 

బరువులెత్తే పనా.. కంగారెందుకు మైహూనా
ఒక రకంగా చూస్తే ఇది రోబో కాదు. మనిషి సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే యంత్రం. కాకపోతే ఇందులోనూ రోబోకు ఉండాల్సిన టెక్నాలజీలు వాడారు. అమెరికా కంపెనీ సాక్రోస్‌ తయారు చేసిన ఈ గార్డియన్‌ ఎక్స్‌ ఓ ను తొడుక్కుంటే సూపర్‌ మ్యాన్‌లా ఎగరలేము కానీ శరీరానికి అతితక్కువ కష్టంతో 90 కిలోల బరువులెత్తగలం. అలుపు లేకుండా ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయగలం. పూర్తిగా చార్జ్‌ అయిన బ్యాటరీలతో రెండు గంటలు పనిచేయొచ్చు. నిమిషాల వ్యవధిలో బ్యాటరీలు మార్చుకోవచ్చు. 

మా రూటే సపరేటు
ప్రాణమున్న కణాల మాదిరిగా పునరుత్పత్తి సామర్థ్యమున్న రోబోలు ఈ జీనోబోట్స్‌. వెర్మాంట్, టఫ్ట్స్‌ యూనివర్సిటీ, వైస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్లీ ఇన్‌స్పైర్డ్‌ ఇంజినీరింగ్‌ శాస్త్రవేత్తలు హార్వర్డ్‌ యూనివర్సిటీలో కలిసికట్టుగా వీటిని తయారు చేశారు. కప్ప కణాలతో తయారైన ఈ జీనోబోట్స్‌ పెట్రిడిష్‌ (గాజు పాత్ర)లో అటూ ఇటూ కదలగలవు. ఏకాకి కణాలను కలుపుకుంటూ కొత్త కణాలను ఉత్పత్తి చేయగలవు. కొన్ని కోట్ల ఆకారాలను పరీక్షించిన తరువాత వెర్మాంట్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ కోర్‌లోని ఎవల్యూషనరీ అల్గారిథమ్‌ ఇంగ్లిషు అక్షరం సీ మాదిరిగా ఉండేలా జీనోబోట్‌ల ఆకారాన్ని నిర్ణయించింది. క్యాన్సర్, వృద్ధాప్యాన్ని నివారించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను వెతికేందుకు ఈ జీనోబోట్స్‌ ఉపకరిస్తాయని అంచనా. 

20 కిలోలైనా ఎత్తుకు తిరిగేస్తా
ఎలాన్‌ మస్క్‌ కంపెనీ టెస్లా సిద్ధం చేస్తున్న జనరల్‌ పర్పస్‌ రోబో. టెస్లాబోట్‌ లేదా ఆప్టిమస్‌ అని పిలుస్తున్నారు. ఇప్పటికి తయారు కాలేదు కానీ ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెస్లా ‘ఏ.ఐ.’డేలో మస్క్‌ మాట్లాడుతూ 2022 నాటికల్లా సిద్ధమవుతుందని ప్రకటించారు. సుమారు 5.8 అడుగుల ఎత్తు, 57 కిలోల బరువుతో మనిషిలాంటి నిర్మాణం ఉన్న ఈ రోబో టెస్లా అభివృద్ధి చేసిన అడాస్‌ కృత్రిమ మేధ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. ఇరవై కిలోల బరువు ఎత్తుకుని అటు ఇటు తిరగగలదు. ఫ్యాక్టరీల్లో పదే పదే చేయాల్సిన పనులను సులువుగా చక్కబెట్టగలదని అంచనా. 

నా చేయి.. 7 విధాలు
జంతువుల ఆకారాల్లో రోబోలను తయారు చేస్తున్న బోస్టన్‌ డైనమిక్స్‌ సిద్ధం చేసిన మరో రోబో ఇది. పేరు స్ట్రెచ్‌. ఫొటోలో కనిపిస్తున్నట్టే గోడౌన్లలో బరువులు అటు ఇటు ఎత్తి పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ప్యాకేజీలను జాగ్రత్తగా పట్టుకోవడం, క్రమపద్ధతిలో అమర్చడం వంటివి కూడా ఎంచక్కా చేసేయగలదు. ఈ రోబో చేయి 7 విధాలుగా తిరగగలదు. వేగంగా కదులుతున్న ప్యాకేజీని స్థిరంగా ఉంచేందుకు తగిన ఏర్పాట్లున్నాయి.

నడిచే చెట్టు.. పరుగెత్తు
అవెంజర్స్, గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసిన వారికి ఈ క్యారెక్టర్‌ పరిచయమే. పేరు గ్రూట్‌. చెట్టు కాండం మాదిరిగా ఉంటుంది. డిస్నీ వరల్డ్‌కు చెందిన పరిశోధనశాలలో తయారైంది. కొంచెం అటు ఇటుగా రెండు అడుగుల ఎత్తుండే ఈ రోబో మనిషిలాగే నడుస్తుంది. పరుగెత్తుతుంది కూడా. ఇప్పటికింకా తయారీ దశలోనే ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top