కంపెనీలకు కలిసొచ్చిన కాలం: హీటెక్కిన రూం ఏసీ మార్కెట్‌     | Sakshi
Sakshi News home page

కంపెనీలకు కలిసొచ్చిన కాలం: హీటెక్కిన రూం ఏసీ మార్కెట్‌    

Published Wed, Feb 22 2023 11:22 AM

Room Air Conditioner Market Size growing amid heat waves - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రూమ్‌ ఎయిర్‌ కండీషనర్ల (ఏసీ) మార్కెట్‌ వేడెక్కింది. వేసవి ముందే రావడం ఇందుకు కారణం. భానుడి ప్రతాపంతో కస్టమర్లు ఏసీలు, రిఫ్రిజిరేటర్ల కోసం ఎలక్ట్రానిక్స్‌ షాపులకు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు లగ్జరీగా భావించిన ఈ ఉపకరణాలు ఇప్పుడు తప్పనిసరి జాబితాలోకి వచ్చి చేరాయని కంపెనీలు అంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విపణి కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని తయారీ సంస్థలు ధీమాగా ఉన్నాయి. హైదరాబాద్‌ విషయానికి వస్తే 2022 ఫిబ్రవరిలో ఈ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏకంగా 35.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైందంటే వేసవి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  

ఆల్‌ టైమ్‌ హైలో విక్రయాలు.. 
దేశంలో రూమ్‌ ఏసీ మార్కెట్‌ విస్తృతి 5-7 శాతం మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయి. 2023-24లో పరిశ్రమ ఏకంగా ఒక కోటి యూనిట్ల మార్కును చేరుకుంటుందని బ్లూ స్టార్‌ చెబుతోంది. ఇదే జరిగితే భారత రూమ్‌ ఏసీ మార్కెట్‌ ఆల్‌ టైమ్‌ హై రికార్డులు నమోదు చేసినట్టు అవుతుంది. 2029 నాటికి పరిశ్రమ 4 కోట్ల యూనిట్లను తాకుతుందని డైకిన్‌ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే  కంపెనీలు ఈ సీజన్‌లో విక్రేతల వద్ద 25 శాతం అధికంగా సరుకు నిల్వ చేశాయి. అంతేగాక తయారీ సామర్థ్యమూ అమ్మకాల తగ్గట్టుగా పెంచుకున్నాయి. భారీగా డిమాండ్‌ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రకటనల బడ్జెట్లనూ అధికం చేశాయని జాన్‌రైస్‌ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్‌ డైరెక్టర్‌ సుమన్‌ గద్దె తెలిపారు.  

భారీ అంచనాలతో.. 
కంపెనీలు ఈ సీజన్‌లో భారీ అంచనాలతో రెడీ అవుతున్నాయి. 2023 శ్రేణి మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నాయి. బ్లూ స్టార్‌ ఏకంగా 75 మోడళ్లను రంగంలోకి దింపింది. రూమ్‌ ఏసీ రంగంలో విలువ పరంగా కంపెనీకి ప్రస్తుతం 13.5 శాతం వాటా ఉంది. 2025 మార్చి నాటికి దీనిని 15 శాతానికి చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. శామ్‌సంగ్‌ ఈ సీజన్‌ కోసం విండ్‌ ఫ్రీ సిరీస్‌తోపాటు మరో 38 మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వేసవి తీవ్రంగా, మరింత ఎక్కువ కాలం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏసీ మార్కెట్‌ బలమైన డిమాండ్‌తో 30 శాతం వృద్ధి చెందవచ్చని గోద్రెజ్‌ అప్లయాన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండింతల అమ్మకాలను ఆశిస్తున్నట్టు వెల్లడించారు. రెండంకెల వృద్ధి లక్ష్యంగా చేసుకున్నట్టు హాయర్‌    ప్రకటించింది. 
     

Advertisement
Advertisement