షాపింగ్ మాల్స్‌లో 38 శాతం తగ్గుదల
8 నగరాలపై కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ నివేదిక
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 8 ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు గణనీయంగా తగ్గాయి. 0.71 మిలియన్ చ.అ.లకు పరిమితమయ్యాయి.
గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 38 శాతం తగ్గాయి. అయితే, ప్రధాన ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లలో స్టాండెలోన్ స్టోర్ల లీజింగ్ స్థూలంగా 33 శాతం పెరిగి 1.51 మిలియన్ చ.అ.లకు చేరింది. షాపింగ్ మాల్స్, మెయిన్ రోడ్ (హై స్ట్రీట్) ప్రాంతాలను కలిపితే మొత్తం రిటైల్ స్పేస్ లీజింగ్ 5 శాతం నెమ్మదించి 2.33 మిలియన్ చ.అ. నుంచి 2.22 మిలియన్ చ.అ.లకు పరిమితమైంది.
సరఫరాపరమైన సవాళ్లు ఇందుకు కారణం. మొత్తం స్థూల లీజింగ్‌లో 68 శాతం వాటా హై స్ట్రీట్స్‌లోని రిటైల్ లొకేషన్స్‌దే ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణే అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా దీన్ని రూపొందించారు. మొత్తం ఎనిమిది నగరాలకు గాను ఆరింటిలో లీజింగ్ పెరగ్గా ముంబై, పుణేలో మాత్రం తగ్గింది.
జనవరి–సెపె్టంబర్ మధ్యకాలంలో చూస్తే కొత్త షాపింగ్ మాల్స్ రాకపోయినప్పటికీ ఈ ఎనిమిది నగరాల్లో మొత్తం రిటైల్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా పెరిగి 6.57 మిలియన్ చ.అ.లకు చేరిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎండీ గౌతమ్ సరాఫ్ తెలిపారు. ప్రీమియం గ్రేడ్ ’ఏ’ మాల్స్‌లో స్పేస్ లభ్యత పెద్దగా లేకపోవడంతో రిటైలర్లు .. పెద్ద సెంటర్లలోని హై స్ట్రీట్లలో స్టోర్లను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ఎస్‌ఆర్‌ఈడీ గ్లోబల్ సహ–వ్యవస్థాపకుడు శ్రీరామ్ పీఎం మోంగా చెప్పారు.
అయితే, మాల్స్, హై స్ట్రీట్ లీజింగ్ లావాదేవీలు ఒకదానితో మరొకటి పోటీపడటం కాకుండా, ఒకదానికి మరొకటి అనుబంధంగా పని చేయొచ్చని వివరించారు. ఇటు మెయిన్ రోడ్లలో స్టోర్స్‌తో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తూనే అటు మాల్స్‌లో కూడా స్టోర్స్‌ని విస్తరించుకోవడం బ్రాండ్స్‌కి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.


