మాల్స్‌లో రిటైల్‌ లీజింగ్‌ డౌన్‌  | Retail leasing slips 6percent to 2. 24 mn sq ft across top 8 cities | Sakshi
Sakshi News home page

మాల్స్‌లో రిటైల్‌ లీజింగ్‌ డౌన్‌ 

Jul 27 2025 4:25 AM | Updated on Jul 27 2025 4:25 AM

Retail leasing slips 6percent to 2. 24 mn sq ft across top 8 cities

హైదరాబాద్‌లో 22 శాతం తక్కువ 

ఎనిమిది నగరాల్లో 6 శాతం తగ్గుదల

జూన్‌ క్వార్టర్‌లో నమోదు 

కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో షాపింగ్‌ మాల్స్, ప్రధాన వీధుల్లోని రిటైల్‌ స్పేస్‌ (వ్యాపార సముదాయాలు) లీజింగ్‌ జూన్‌ త్రైమాసికంలో బలహీనపడింది. ఏప్రిల్‌–జూన్‌ కాలంలో ఎనిమిది నగరాల్లో రిటైల్‌ స్పేస్‌ లీజింగ్‌ 2.24 మిలియన్‌ చదరపు అడుగులుగా (ఎస్‌ఎఫ్‌టీ) నమోదైంది.

 క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్‌ 2.39 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. మొత్తం లీజింగ్‌లో 45% మేర, 1.01 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ షాపింగ్‌ మాల్స్‌కు సంబంధించి ఉంది. ప్రధాన మార్గాల్లో (వీధుల వెంట) రిటైల్‌ సేŠప్స్‌ లీజింగ్‌ 55% వాటాతో 1.23 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. 
    
హైదరాబాద్‌లో రిటైల్‌ స్పేస్‌ లీజింగ్‌ 0.76 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది. క్రితం ఏడా ది ఇదే త్రైమాసికంలో లీజింగ్‌ 0.98 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గింది. 
→ బెంగళూరులోనూ లీజింగ్‌ క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 44% తగ్గి 0.18 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.  
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 41 శాతం క్షీణతతో 0.3 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. 
→ అత్యధికంగా అహ్మదాబాద్‌ మార్కెట్లో రిటైల్‌ స్పేస్‌ లీజింగ్‌ 63 శాతం తగ్గిపోయింది. 0.04 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.  
→ కోల్‌కతాలో లీజింగ్‌ 23 శాతం తగ్గి 0.05 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.  
→ చెన్నై నగరంలో మాత్రం 0.16 మిలియన్‌ ఎస్‌ ఎఫ్‌టీకి లీజింగ్‌ పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్‌ 0.10 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది. 
→ ముంబైలో లీజింగ్‌ డిమాండ్‌ రెట్టింపై 0.20 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ నుంచి 0.52 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. 
→ పుణెలో రెండింతలు వృద్ధి చెందింది. 0.09 నుంచి 0.23 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి లీజింగ్‌ పరిమాణం పెరిగింది.  

ఆశావహ అంచనా 
ప్రీమియం షాపింగ్‌ మాల్స్‌లో ఖాళీలు తగ్గుముఖం పట్టినట్టు కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ రీసెర్చ్‌ హెడ్‌ సువిశేష్‌ వాల్సన్‌ తెలిపారు. ‘‘భవిష్యత్తు కాలానికి ఆశావహంగానే ఉన్నాం. 4 మిలియన్‌ చదరపు అడుగులు మేర గ్రేడ్‌–ఏ రిటైల్‌ స్పేస్‌ అదనంగా ఈ ఏడాది ద్వితీయ 6 నెలల్లో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో కొత్త సరఫరా ఉంటుంది’’అని తమ అంచనాలను వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement