మరో సంచలన ప్రాజెక్టుకు రిలయన్స్‌ జియో శ్రీకారం

Reliance Jio to construct largest international submarine cable system - Sakshi

ముంబై: టెలికాం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ మరో ఘనతను సాధించబోతోంది. అధికమవుతున్న డేటా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో భారీ స్థాయిలో సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టులకు కంపెనీ శ్రీకారం చుట్టింది. సముద్ర మార్గం ద్వారా అత్యాధునిక కేబుల్స్‌తో ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్, ఇండియా యూరప్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఈ ప్రాజెక్టులను అమలు చేయనుంది. ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ వేస్తారు. సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం ఉంటుంది. భారత్‌తో తూర్పున సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా.. పశ్చిమాన ఈజిప్ట్, జిబూటీ, సౌదీ అరేబియాతోపాటు ఇటలీని కనెక్ట్‌ చేస్తారు. 

2024 ప్రారంభం నాటికి ఇవి పూర్తి అవుతాయి. రెండు ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి అనుసంధానమై, అంతర్జాతీయ డేటా ఇంటర్‌ఇంటర్ ఎక్స్ ఛేంజ్ పాయింట్లను కలుపుతారు. భారత్‌తో పాటు, వెలుపల కూడా వినియోగదార్లు, కంపెనీలకు కంటెంట్, క్లౌడ్‌ సేవల విషయంలో సామర్థ్యం పెంచేందుకు ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయని రిలయన్స్‌ జియో వెల్లడించింది. ‘ఫైబర్‌ ఆప్టిక్‌ సబ్‌మెరైన్‌ టెలికమ్యూనికేషన్ల చరిత్రలో మొదటిసారిగా ఈ వ్యవస్థలు భారతదేశాన్ని అంతర్జాతీయ నెట్‌వర్క్‌ పటంలో ఉంచుతాయి. భారత్‌లో డిజిటల్‌ సేవలు, డేటా వినియోగం వృద్ధిలో జియో ముందుంది. భారత్‌ కేంద్రంగా తొలిసారి సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో నాయకత్వ పాత్రను పోషిస్తున్నాం’ అని రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ వ్యాఖ్యానించారు.

చదవండి: ఆ రోజున నెఫ్ట్‌ సేవలకు అంతరాయం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top