సెలూన్‌ వ్యాపారంలోకి రిలయన్స్‌!

Reliance To Enter Salon Business - Sakshi

నేచురల్స్‌లో 49 శాతం వాటా

కొనుగోలుపై కసరత్తు

హెచ్‌యూఎల్‌ వంటి సంస్థలతో పోటీ

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇప్పుడు సెలూన్‌ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. గ్రూప్‌ సంస్థ, దేశీయంగా అతి పెద్ద రిటైలింగ్‌ కంపెనీ అయిన రిలయన్స్‌ రిటైల్‌ తాజాగా చెన్నైకి చెందిన నేచురల్స్‌ సెలూన్‌ అండ్‌ స్పాలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి నేచురల్స్‌ ప్రమోటర్లతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించబోతున్నది మాత్రం వెల్లడి కాలేదు.

తమ కంపెనీ చరిత్రలోనే ఇది ‘అతి పెద్ద మలుపు‘ అంటూ నేచురల్స్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సీకే కుమరవేల్‌ .. లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఒక బహుళజాతి దిగ్గజం సెలూన్‌ పరిశ్రమలోకి ప్రవేశించబోతోంది’ అని పేర్కొన్నారు. ‘నేచురల్స్‌లో రిలయన్స్‌ రిటైల్‌ 49 శాతం వాటా కొనబోతోంది. దీనితో సెలూన్ల సంఖ్య మొత్తం 700 నుండి 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. రాబోయే రోజుల్లో నేచురల్స్‌లో గణనీయమైన మార్పులు చూడబోతున్నాం’ అని కుమరవేల్‌ పోస్ట్‌ చేశారు.

నేచురల్స్‌ కార్యకలాపాల విస్తరణలో సహాయపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, నేచురల్స్‌లో వాటాల కొనుగోలు వార్తలపై స్పందించిన రిలయన్స్‌ ప్రతినిధి .. తాము ఎప్పటికప్పుడు వివిధ అవకాశాలను పరిశీలిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ డీల్‌ పూర్తయితే లాక్మే బ్రాండ్‌ పేరిట సెలూన్‌ సెగ్మెంట్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న హిందుస్తాన్‌ యూనిలీవర్‌ వంటి దిగ్గజాలతో రిలయన్స్‌ రిటైల్‌ పోటీపడనుంది.

2000ల తొలినాళ్లలో కార్యకలాపాలు ప్రారంభించిన నేచురల్స్‌కు దేశవ్యాప్తంగా 700 సెలూన్‌లు ఉన్నాయి. 2025 నాటికి వీటి సంఖ్యను 3,000కు పెంచుకోవాలని యోచిస్తోంది. ఇక రిలయన్స్‌ గ్రూప్‌లో అన్ని రిటైల్‌ కంపెనీలకు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) హోల్డింగ్‌ కంపెనీగా ఉంది. దీనికి రిలయన్స్‌ రిటైల్‌ అనుబంధ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఆర్‌వీఎల్‌ రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్‌ (కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన) నమోదు చేసింది.  

రిలయన్స్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా కేవీ కామత్‌
ప్రముఖ బ్యాంకర్‌ కేవీ కామత్‌ను ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని కంపెనీ బోర్డులో  స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  శుక్రవారం ప్రకటించింది. 74 సంవత్సరాల కామత్‌ను ఐదేళ్ల కాలానికి నియమించినట్లు సంస్థ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌కి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. 1971లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఐఐఎం అహ్మదాబాద్‌ గ్రాడ్యుయేట్, పద్మభూషణ్‌ కామత్‌కు బ్యాంకింగ్‌ రంగంలో అపార అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల పదవీ విరమణ చేసిన రిలయన్స్‌ బోర్డులోని ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరి స్థానంలో కామత్‌ నియమితులయ్యారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top