
జాబ్ ఇంటర్వ్యూకు బస్సులో వచ్చిన యువతికి ఉద్యోగం లేదు.. ఏమీ లేదు పో.. అంటూ ఓ కంపెనీ వెనక్కి పంపేసింది. తనకు ఎదురైన ఈ షాకింగ్ అనుభవాన్ని ఆ యువతి ప్రొఫెషనల్ సామాజిక వేదిక రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. తన అర్హతలు, నైపుణ్యాలు చూడకుండా కేవలం తాను ప్రజా రవాణాను ఉపయోగించినందుకు ఇంటర్వ్యూ నుంచి పంపించేశారని ఆమె వాపోయారు.
యువతి రెడ్డిట్ పోస్ట్ ప్రకారం.. బస్సు దిగి కంపెనీ భవనంలోకి నడిచి వస్తున్న ఆమెను సెక్యూరిటీ కెమెరాల్లో గమనించిన హైరింగ్ మేనేజర్.. ఇంటర్వ్యూ మొదలవ్వగానే ఆమె అర్హతలు లేదా అనుభవం గురించి కాకుండా మొదట ఆమె బస్సులో రావడం గురించే అడిగాడు. ప్రజా రవాణాను ఉపయోగించినందుకు అసహనం వ్యక్తం చేసిన ఆయన అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగానూ కామెంట్ చేశాడు. ఎర్రగా ఉన్న ఆమె జుట్టును "అన్ ప్రొఫెషనల్" అని వ్యాఖ్యానించాడు.
అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే.. "ఇప్పుడే ఇంటర్వ్యూకు వెళ్లొచ్చాను. నేను కంపెనీ భవనం వైపు నడిచిరావడం కెమెరాల్లో చూశానని బాస్ చెప్పారు. నీకు మంచి ట్రాన్స్‌పోర్ట్ లేదా అని అడిగారు. ప్రజా రవాణాను ఉపయోగించకూడదని చెప్పి కొన్ని నిమిషాలు మందలించాడు. నన్ను ఎవరూ నియమించుకోరని, తానైతే ఇలాంటి వారికి అస్సలు జాబివ్వనని చెప్పాడు. ఎందుకంటే వారు సమయానికి రారు. ఇక నా ఎర్రటి జుట్టు గురించి ఫిర్యాదు చేయడం కొనసాగించాడు. అది నన్ను అన్ ప్రొఫెషనల్ గా మార్చింది అన్నాడు. ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగలేదు. తమకు చాలా మంది అభ్యర్థులు ఉన్నారని, షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను పంపించేశారు."
అయితే ఇంతకీ సదరు కంపెనీ ఏది.. అనుచితంగా ప్రవర్తించిన ఆ హైరింగ్ మేనేజర్ పేరేంటి అన్నది ఆమె వెల్లడించలేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌కు చాలా మంది యూజర్లు ప్రతిస్పందించారు. అలా ప్రవర్తించిన ఆ మేనేజర్ తీరును తప్పుబట్టారు. ఆమెకు మద్దుతుగా నిలిచారు.