ఆటో కంపెనీలకు దసరా పండగ..

Record festive demand drives auto sales in October - Sakshi

అక్టోబర్‌లో జోరుగా విక్రయాలు

మారుతీ అమ్మకాలు 20 శాతం అప్‌

హ్యుందాయ్‌ 13 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌లో వాహనాల విక్రయాలు జోరుగా సాగాయి. కొత్త వస్తువుల కొనుగోళ్లకు శుభకరంగా పరిగణించే నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయని ఆటోమొబైల్‌ వర్గాలు వెల్లడించాయి. దిగ్గజ సంస్థలు మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్‌ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) విక్రయాలు సుమారు 20 శాతం వృద్ధితో 1,72,862 యూనిట్లుగా నమోదయ్యాయి. మినీ కార్ల అమ్మకాలు తగ్గినప్పటికీ స్విఫ్ట్, సెలీరియో వంటి కాంపాక్ట్‌ కార్లు, ఎస్‌–క్రాస్‌ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరిగాయి.

అటు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా  నెలవారీగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. అక్టోబర్‌లో విక్రయాలు 13 శాతం పెరిగి 56,605 యూనిట్లకు చేరాయి. చివరిసారిగా 2018 అక్టోబర్‌లో హ్యుందాయ్‌ అత్యధికంగా 52,001 యూనిట్లు విక్రయించింది. ‘అక్టోబర్‌ గణాంకాలు వ్యాపార పరిస్థితులపరంగా సానుకూల ధోరణులకు శ్రీకారం చుట్టాయి. మరింత మెరుగైన పనితీరు కనపర్చగలమని ధీమాగా ఉన్నాం‘ అని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా డైరెక్టర్‌ తరుణ్‌ గర్గ్‌ తెలిపారు. ఇక హోండా కార్స్‌ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 10,836 యూనిట్లకు చేరాయి. మార్కెట్‌ సెంటిమెంట్‌కి తగ్గట్టుగా, తమ అంచనాలకు అనుగుణంగా అక్టోబర్‌లో సానుకూల ఫలితాలు సాధించగలిగామని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ చెప్పారు.

నవరాత్రుల్లో అమ్మకాలు..
అక్టోబర్‌ మధ్యలో నవరాత్రులు మొదలైనప్పట్నుంచి వాహనాల విక్రయాలు పుంజుకున్నాయి. నవరాత్రుల్లో మారుతీ సుజుకీ అమ్మకాలు 27 శాతం పెరిగి 96,700 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో మారుతీ సుమారు 76,000 వాహనాలు విక్రయించింది. ఇక హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలు కూడా 28 శాతం పెరిగి 26,068 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్‌ విక్రయాలు ఏకంగా 90 శాతం వృద్ధితో 5,725 యూనిట్ల నుంచి 10,887 యూనిట్లకు పెరిగాయి. సమీప భవిష్యత్తుపై పరిశ్రమ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top