ఈఎంఐ.. ఇంకా తగ్గేనోయ్‌ | RBI repo rate cut reduce to EMIs or tenure | Sakshi
Sakshi News home page

ఈఎంఐ.. ఇంకా తగ్గేనోయ్‌

Jun 7 2025 4:36 AM | Updated on Jun 7 2025 8:04 AM

RBI repo rate cut reduce to EMIs or tenure

గృహ, వాహన రుణాలు మరింత చౌక 

వృద్ధికి ఊతమిచ్చే దిశగా ఆర్‌బీఐ చర్యలు 

రెపోలో 0.5% కోత 5.5 శాతానికి రేటు 

సీఆర్‌ఆర్‌ 1% తగ్గింపు  

బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ. 2.5 లక్షల కోట్లు

అంతటా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరిన్ని చర్యలకు ఆర్‌బీఐ ఉపక్రమించింది. ధరలు కాస్త అదుపులో ఉంటున్న నేపథ్యంలో కీలక రెపో రేటులో ఏకంగా అర శాతం కోత పెట్టి 5.5 శాతానికి తగ్గించింది. దీంతో గృహ, వాహన, ఇతరత్రా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. 

అలాగే, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం నుంచి మరికాస్త  ఉపశమనం లభించనుంది. ఇక నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు లభ్యత పెరిగి, ఎకానమీకి బూస్ట్‌లాగా  పని చేయనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయాన్ని  పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అటు మార్కెట్లు కూడా జోరుగా పరుగులు తీశాయి.  

ముంబై: కీలక పాలసీ రేట్ల కోత ఊహిస్తున్నదే అయినా రిజర్వ్‌ బ్యాంక్‌ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పావు శాతం తగ్గింపు ఉండొచ్చని భావిస్తుండగా.. శుక్రవారం ఏకంగా అరశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కీలకమైన రెపో రేటు 5.5 శాతానికి దిగి వచి్చంది. 2020 మే తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారిగా ఆర్‌బీఐ పాలసీ రేటును తగ్గించింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో కూడా కోతను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తం దీన్ని 100 బేసిస్‌ పాయింట్ల (ఒక్క శాతం) మేర తగ్గించినట్లయింది. 

ఇక బ్యాంకులకు నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్‌) 100 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఇది 3 శాతానికి చేరింది. ఇప్పటికే మిగులు నిధులున్న బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి దీనితో మరో రూ. 2.5 లక్షల కోట్లు అదనంగా వచ్చి చేరనున్నాయి. సీఆర్‌ఆర్‌ కోత సెప్టెంబర్‌–డిసెంబర్‌ మధ్య నాలుగు విడతలుగా అమల్లోకి వస్తుంది. మరోవైపు, రూ. 2.5 లక్షల లోపు పసిడి రుణాలపై లోన్‌–టు–వేల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని ప్రస్తుతమున్న 75 శాతం నుంచి 85 శాతానికి ఆర్‌బీఐ పెంచింది.  

బుధవారం నుంచి మూడు రోజులు పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సారథ్యంలో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పాలసీ రేటును అర శాతం తగ్గించే ప్రతిపాదనకు అనుకూలంగా అయిదుగురు ఓటేశారు. ‘ఉదార’ విధానం నుంచి ‘తటస్థ’ విధానానికి పాలసీని మారుస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అంటే, రెపో రేటును తగ్గించడానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో వచ్చే డేటాను బట్టి పెంచడం, తగ్గించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది.  

రెపో తగ్గితే.. 
బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఈ రేటును తగ్గిస్తే దీనితో అనుసంధానమైన ప్రామాణిక రుణ రేట్లు (ఈబీఎల్‌ఆర్‌) తగ్గుతాయి. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయిస్తే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం అర శాతం మేర తగ్గుతుంది. అయితే, రేట్ల కోతతో రుణ గ్రహీతలకు భారం తగ్గనున్నప్పటికీ.. డిపాజిట్‌ రేట్లు కూడా తగ్గడం వల్ల డిపాజిటర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. 

వృద్ధికి దన్ను.. 
ఓవైపు ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టి లకి‡్ష్యత స్థాయి కన్నా దిగువకు రావడం, మరోవైపు సర్వత్రా అనిశ్చితి నెలకొని వృద్ధి నెమ్మదించడం వంటి అంశాల నేపథ్యంలో రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు సంజయ్‌ మల్హోత్రా చెప్పారు. ‘‘వృద్ధికి దోహదపడేలా పాలసీ రేట్లను ఉపయోగించి దేశీయంగా ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం నెలకొంది’’ అని ఆయన తెలిపారు. 7–8 శాతం స్థాయిలో అధిక వృద్ధి ఆకాంక్ష సాధన దిశగా తీసుకున్న చర్యగా మానిటరీ పాలసీని చూడాలని మల్హోత్రా వివరించారు.

ఆశ్చర్యపర్చింది.. 
ఎంపీసీ నిర్ణయం చాలా వినూత్నంగా, ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యపర్చింది. ఎకానమీలో అన్ని రంగాలకు, ముఖ్యంగా బ్యాంకింగ్‌.. ఫైనాన్స్‌కు ఇది కచ్చితంగా సానుకూలాంశం.
– సీఎస్‌ శెట్టి, చైర్మన్, ఎస్‌బీఐ

హౌసింగ్‌ మెరుగవుతుంది.. 
ఈఎంఐల భారం తగ్గడం వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్‌ మెరుగుపడుతుంది. మొద టిసా రి కొనుగోలు చేసే వారు తగిన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడుతుంది. 
– శేఖర్‌ జి.పటేల్, ప్రెసిడెంట్, క్రెడాయ్‌

వృద్ధికి ఊతమిస్తుంది.. 
లిక్విడిటీ పెరగడం, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వినియోగానికి ఊతమిస్తుంది. పెట్టుబడులకూ దోహదపడుతుంది.  
– రాజీవ్‌ సబర్వాల్, ఎండీ, టాటా క్యాపిటల్‌  

ఆటో రంగానికి సానుకూలం 
‘‘రెపో రేటును తగ్గించడంతో మరింత తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభిస్తాయి ఆటో పరిశ్రమకు ఇది సానుకూలం. 
– శైలేష్‌ చంద్ర, ప్రెసిడెంట్, సియామ్‌

మా పని మేము చేశాం .. 
ఫిబ్రవరి నుంచి 100 బేసిస్‌ పాయింట్ల స్థాయిలో వేగంగా రెపో రేటును తగ్గించాం. ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేటును ఉపయోగించి వృద్ధికి ఊతమిచ్చేలా మరిన్ని చర్యలను తీసుకునేందుకు అవకాశాలు ఇక పరిమితంగానే ఉన్నాయి. నా విధులను నిర్వర్తించడాన్ని నేను విశ్వసిస్తాను. మేము మా వంతుగా చేయాల్సింది చేసాం. ఇక మిగతావారు తమ వంతుగా చేయాల్సినది చేస్తారని ఆశిస్తున్నాం.  
– సంజయ్‌ మల్హోత్రా, గవర్నర్, ఆర్‌బీఐ 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement