
ముంబై: ద్రవ్యోల్బణం, వృద్ధిపై అంచనాలే భవిష్యత్తు రేట్ల కోతను నిర్ణయిస్తాయే గానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా కాదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. రుణ వృద్ధికి మద్దతుగా ఆర్‌బీఐ రేట్ల కోతను చేపట్టినట్టు చెబుతూ.. ఇది అస్సెట్ బబుల్‌కు (ఆస్తుల విలువ అతిగా పెరిగేందుకు) దారితీయదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు రేట్ల కోతకు అదనంగా ఆర్‌బీఐ చేతిలో అ్రస్తాలున్నట్టు చెప్పారు.
ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక శాతం రెపో రేటు కోతను చేపట్టడం తెలిసిందే. పరపతి విధానం అమలు ఆలస్యంగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కనుక ద్రవ్యోల్బణం వంటి కీలక డేటా విషయంలో 12 నెలల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రేట్ల కోతపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’’అని మల్హోత్రా తెలిపారు. క్యూ4లో ద్రవ్యోల్బణం 4.4 శాతం ఉంటుందన్నది అంచనాలు కాగా, ప్రస్తుత తీరు చూస్తుంటే ఇంకా తగ్గేలా ఉందన్నారు. జూన్ వరకు ఉన్న డేటాను గమనిస్తే బ్యాంకుల రుణ రేట్లు అర శాతం మేర తగ్గాయని.. ఆర్‌బీఐ నిర్ణయం పూర్తిగా అమలైనట్టు ఇది తెలియజేస్తోందన్నారు.
మెరుగైన రుణ వృద్ధి
2024–25లో రుణాల్లో వృద్ధి 12.1 శాతంగా ఉందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. దశాబ్దం సగటు 10 శాతం కంటే అధికమన్నారు. 2025–26లో ఇది 9 శాతంగా ఉండొచ్చన్నారు. వృద్ధికి అనుకూలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు ఉండేలా చూస్తామని పరిశ్రమకు హామీ ఇచ్చారు. వృద్ధికి మద్దతుగా భారీ రేట్ల కోత చేపట్టి ఆర్‌బీఐ తన సాధనాలను పూర్తిగా వినియోగించేసిందా? అన్న ప్రశ్నకు.. రేట్ల కోతకు అదనంగా మరిన్ని అ్రస్తాలు తమ వద్ద ఉన్నట్టు చెప్పారు. సీఆర్‌ఆర్‌ను 3 శాతానికి తగ్గించినప్పటికీ, ఎలాంటి అవసరం ఏర్పడినా ఎదుర్కొనేందుకు తగినన్ని నిధులున్నట్టు తెలిపారు. కరోనా సమయంలోనూ ఒక శాతమే వినియోగించినట్టు గుర్తు చేశారు. సీఆర్‌ఆర్ తగ్గింపు కేవలం లిక్విడిటీని పెంచడమే కాకుండా మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గించడం కోసమన్నారు. ఇది అంతిమంగా రుణ వ్యయాలను కూడా తగ్గిస్తుందన్నారు.
ఆర్థిక సేవల విస్తృతికి వీలుగా బ్యాంక్ సిబ్బంది ప్రతి వారం 2.7 లక్షల గ్రామ పంచాయితీలను సందర్శిస్తున్నట్టు చెప్పారు. పారిశ్రామిక గ్రూప్‌లను బ్యాంకింగ్‌లోకి అనుమతించే విషయంలో ఆర్‌బీఐ ఆందోళనలను ప్రస్తావించగా.. ప్రయోజన వైరుధ్యం రిస్క్ ఉంటుందన్నారు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వ్యయాలను ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో రాష్ట్రాలు లేదా వినియోగదారులు చెల్లించాల్సి రావచ్చన్నారు. ఈ వ్యవస్థ సాఫీగా సాగేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.
యూకేతో ఒప్పందం భారత్‌కు మేలు
బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం భారత్‌కు మేలు చేస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. తయారీ, సేవల రంగంలో ఎన్నింటికో ప్రయోజనం చేకూరుస్తుందంటూ.. ఇదే తరహా మరిన్ని ఒప్పందాలు అవసరమన్నారు. మరిన్ని దేశాలతో ఒప్పందాలు చర్చల దశలో ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శిస్తున్నప్పటికీ.. సెంట్రల్ బ్యాంక్ స్వతంత్రను కాపాడుతున్నారంటూ యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌ను అభినందించారు.