
మొదలైన పరపతి ద్రవ్య సమీక్ష
1న వెల్లడి కానున్న నిర్ణయాలు
ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (MPC) సమీక్షా సమావేశం సోమవారం మొదలైంది. కీలక రెపో రేటును 5.50 శాతం వద్ద కొనసాగిస్తూ, యథాతథ విధానానికి మొగ్గు చూపించొచ్చని కొందరు విశ్లేషకుల అంచనా. మరికొందరు అయితే పావు శాతం రేటు కోతను చేపట్టొచ్చని భావిస్తున్నారు. ఆర్‌బీఐ(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఎంపీసీ తన నిర్ణయాలను 1వ తేదీ ఉదయం ప్రకటించనుంది.
భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడం, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు దేశ ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావాన్ని ఎంపీసీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ మొత్తం 100 బేసిస్ పాయింట్లు (ఒక శాతం) మేర రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ద్రవ్యోల్బణం నియంత్రణల్లోకి రావడంతో నగదు లభ్యత పెంపు దిశగా ఆర్‌బీఐ ఎన్నో చర్యలు చేపట్టింది. కానీ, ఆగస్ట్ సమీక్షలో మాత్రం యథాతథ స్థితికి మొగ్గు చూపించింది. అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో వేచి చూసే ధోరణిని అనుసరించింది.
డిసెంబర్‌లో కోత..
ఆర్‌బీఐ ఎంపీసీ రెపో రేటు(Repo Rate)ను 5.50 శాతం వద్ద కొనసాగిస్తుందని గోల్డ్‌మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. తటస్థ విధానాన్ని కొనసాగించొచ్చని పేర్కొంది. గతంలో చేపట్టిన ఒక శాతం రేటు తగ్గింపు పూర్తి స్థాయిలో బదిలీ అయ్యే వరకు వేచి చూడొచ్చని అభిప్రాయపడింది. డిసెంబర్ సమీక్షలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి రెపో రేటును 5.25 శాతం చేయొచ్చని పేర్కొంది. వాణిజ్య అనిశ్చితులు ఆర్థిక వృద్ధిని కిందకు తీసుకెళతాయని ఎంపీసీ భావిస్తే అప్పుడు.. పావు శాతం రేటు తగ్గింపును అక్టోబర్ సమీక్షలోనే తీసుకోవచ్చని అంచనా వేసింది.
డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్ము
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్మును కేంద్రం నియమించింది. ఎం.రాజేశ్వరరావు స్థానంలో ఈ నియామకం జరిగింది. రాజేశ్వరరావుకు పొడిగించిన పదవీకాలం అక్టోబర్ 8తో ముగియనుంది. అక్టోబర్ 9 లేదా ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పదవీకాలంతో ముర్ము నియామకానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. ముర్ము ప్రస్తుతం ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.