క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

RBI Governor Made Crucial Comments On CryptoCurrency - Sakshi

క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు

ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టీకరణ

వారంలో రెండోసారి ఆందోళన వ్యక్తంచేసిన ఆర్‌బీఐ గవర్నర్‌

RBI Governor Shaktikanta Das on Cryptocurrencies: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వారంలో రెండవసారి క్రిప్టో కరెన్సీలపై తన ఆందోళన వ్యక్తం చేశారు. వర్చువల్‌ కరెన్సీతో ‘చాలా లోతైన సమస్యలు’’ ఇమిడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్‌ స్థిరత్వానికి కూడా దీనివల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ అంశంపై సమగ్ర, లోతైన చర్చ అవసరమని కూడా స్పష్టం చేశారు. ఆర్‌బీఐ అంతర్గత సమావేశాల్లోనూ ఇవే అభిప్రాయాలు వ్యక్తమయినట్లు వెల్లడించారు. ఎస్‌బీఐ ఎనిమిదవ బ్యాంకింగ్, ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి గవర్నర్‌ మంగళవారం చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 

► పార్లమెంటరీ స్థాయి సంఘం క్రిప్టో కరెన్సీలపై ఏమి చర్చించిందన్న విషయం నాకు తెలియదు.

► క్రిప్టోకరెన్సీలపై  కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ సవివరమైన నివేదికను సమర్పించింది.  ఇది ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉంది.

► క్రిప్టో కరెన్సీకి సంబంధించి ప్రస్తుత ట్రేడింగ్‌ పరిమాణంపై అనుమానాలు ఉన్నాయి. రుణ ఆఫ ర్లు ఇవ్వడం ద్వారా ఖాతాలను తెరవడానికి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారన్న సమాచారం ఉంది.

► ఖాతాలను తెరవడానికి రుణ సౌలభ్యతసహా పలు రకాల ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

► క్రిప్టో మార్కెట్‌లో  పెట్టుబడుల సంఖ్య పెరుగుతోంది తప్ప, పరిమాణం పెరగడంలేదన్నది సుస్పష్టం. ఎక్కువ మంది పెట్టుబడిదారులు రూ.500,  రూ. 1,000 లేదా రూ. 2,000 వంటి కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నట్లు సమాచారం. 70 నుండి 80 శాతం  ఖాతాలు ఈ తరహావే ఉంటున్నట్లు తెలుస్తోంది.

► వర్చువల్‌ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన  నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్‌ 6వ తేదీన ఆర్‌బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.  

ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది
► భారత్‌ ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టంగా ఉంది.

► ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభాలు పటిష్టంగా ఉండడంతోపాటు, వేగవంతంగా వ్యాక్సినేషన్‌ పక్రియ జరుగుతుండడం, పండుగల సీజన్‌ వంటి అంశాలు దేశంలో డిమాండ్‌ రికవరీ పటిష్టతకు దారితీస్తోంది.

► కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులు క్రమంగా తగ్గుతుండటంతో దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధికి తగిన అన్ని అవకాశాలూ ఉన్నాయి.

► వినియోగ డిమాండ్‌ గణనీయంగా మెరుగుపడుతోంది. అయితే ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరగాల్సి ఉంది.

► తీవ్ర సవాళ్లు ఎదురయినప్పటికీ, భారత్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ కరోనా ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొంది.

► ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకునే అవకాశాలున్నాయి. ఇందుకు తగిన మూలధన పటిష్టతతో బ్యాంకులు సిద్ధంగా  ఉండాలి.

క్రిప్టోకు కేంద్రం సిద్ధమన్న వార్తల నేపథ్యంలో 
క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.  ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం.

మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్‌ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలపై శక్తికాంత దాస్‌ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘క్రిప్టో ఇండస్ట్రీని రెగ్యులేట్‌ చేయాలని ప్రభుత్వ నిర్ణయించినట్లయితే, ఆ విధులను ఆర్‌బీఐ నిర్వహిస్తుందా?’ అని ఇటీవల ఒక కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నపై వ్యాఖ్యానించడానికి గవర్నర్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెల్లో కూడా దాస్‌ క్రిప్టో కరెన్సీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 

చదవండి: క్రిప్టోపై కేంద్రం కీలక అడుగులు.. నిషేధానికి నో

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top