5.25 శాతం వద్దే రెపోరేటు
ద్రవ్యోల్బణ అంచనాల పెంపు
జీడీపీ వృద్ధి అంచనా కుదింపు
ముంబై: ఎవరూ ఊహించని విధంగా మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) రూపాయికి భారీ బూస్ట్‌నిస్తూ విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే విధంగా ఆరు ప్రధాన చర్యలు ప్రకటించింది. మరోపక్క రూపాయికి దన్నునిస్తూ ప్రభుత్వం సైతం విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బాండ్లలో పన్ను రిలీఫ్‌ను ప్రకటించింది. వెరసి రూపాయి గత రెండు నెలల్లోలేని విధంగా బలపడింది. వీటితోపాటు ఆర్‌బీఐ గవర్నర్ అధ్యక్షతన సమావేశమైన ఎంపీసీ యథాతథ రేట్ల అమలుకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లే ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన సమావేశమైన ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది.
ఓవైపు ద్రవ్యోల్బణ అంచనాలు పెంచడం, మరోపక్క వృద్ధి అంచనాలలో కోత పెట్టినప్పటికీ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 5.25 శాతంవద్దే కొనసాగించేందుకు ఏకగ్రీవంగా నిర్ణయించింది. అయితే ఈసారి కొద్ది రోజులుగా డాలరుతో మారకంలో బక్కచిక్కుతున్న దేశీ కరెన్సీకి బలాన్నివ్వడంపై అత్యధికంగా దృష్టి పెట్టింది. ఇందుకు అనుగుణంగా ఆరు ప్రధాన విధాన నిర్ణయాలను ప్రకటించింది. వీటికి జతగా ప్రభుత్వం సైతం ఒక చెయ్యివేస్తూ విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను సంబంధ ఉపశమనాన్ని ప్రకటించింది. వెరసి రూపాయి జోరందుకుని 56 పైసలు బలపడింది.
ఆర్‌బీఐ తాజా అంచనాలివీ..
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో ఆర్థిక(జీడీపీ) పురోభివృద్ధి 6.6 శాతానికి పరిమితంకావచ్చు. ఏప్రిల్‌లో ప్రకటించిన 6.9 శాతం అంచనాలను తగ్గించింది. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను 5.1 శాతానికి పెంచింది. మూడో త్రైమాసికంలో గరిష్టంగా 5.9 శాతానికి చేరవచ్చు. పూర్తి ఏడాదికి ఇంతక్రితం 4.6 శాతంగా ఊహించింది. పెరుగుతున్న వ్యయాలు ధరలను ఎగదోసే వీలుంది. స్థూల ఆర్థిక మూలాలు గతంకంటే పటిష్టంగా ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, బలపడుతున్న కమోడిటీ ధరలు, సరఫరా అవాంతరాలు, రుతుపవనాలు ఆర్థిక పురోగతిని ప్రభావితం చేయవచ్చని గవర్నర్ మల్హోత్రా చెప్పారు.


