రూ.22,842 కోట్ల ఫ్రాడ్‌, దాడులు చేసిన ఈడీ!

Raids At Multiple Locations In Rs 22,842 Crore ABG Shipyard Fraud Case - Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం  ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌కు సంబంధించి ముంబై, పుణే, సూరత్‌లలోని  దాదాపు 26 కార్యాలయాలు, నివాసాలపై దాడులు నిర్వహించింది. అక్రమ ధనార్జన, రూ.22,842 కోట్ల బ్యాంకింగ్‌ మోసాల కేసుల విచారణలో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఒక ప్రకటనలో ఈడీ తెలిపింది. కంపెనీ, ఆ సంస్థ మాజీ ప్రమోటర్లు, ఇతర సంబంధిత వ్యక్తుల ఆర్థిక పత్రాలు, సంబంధిత సమాచారాన్ని సేకరించేందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

సీబీఐ కేసు అధ్యయనం అనంతరం... 
గ్రూప్‌ కార్యకలాపాలపై రూపొందించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికతో పాటు షిప్‌ బిల్డింగ్‌ కంపెనీ మాజీ ప్రమోటర్లపై సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను అధ్యయనం చేసిన తర్వాత ఫిబ్రవరిలో ఈడీ మనీలాండరింగ్‌ కేసును దాఖలు చేసింది. బ్యాంకుల కన్సార్టియంను రూ. 22,842 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలపై ఏబీజీ షిప్‌యార్డ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిషి కమలేష్‌ అగర్వాల్, తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసులు నమోదయిన వారిలో అప్పటి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్‌ కుమార్‌ అగర్వాల్, రవి విమల్‌ నెవెటియా, మరో కంపెనీ ఏబీజీ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై కేసులు దాఖలయ్యాయి.  

ఆరోపణలు ఇవీ... 
నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, అధికారిక పదవి దుర్వినియోగం వంటి నేరాలకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద వీరిపై ఈ కేసులు నమోదయ్యాయి. బ్యాంకు రుణాల నిధులను ‘మళ్లింపు‘ చేయడం, అక్రమ ధనార్జనకు షెల్‌ కంపెనీలను సృష్టించడం, ఆయా అంశాల్లో కంపెనీ అధికారుల పాత్ర వంటి ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top