
ప్యూర్‌పవర్ శ్రేణి ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ప్యూర్ తాజాగా ‘స్మార్ట్ ఇన్వర్టర్ల’ విభాగంలోకి ప్రవేశించింది. గృహ, వాణిజ్య అవసరాల కోసం ‘ప్యూర్‌పవర్’ పేరిట విద్యుత్ స్టోరేజీ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. ఇవి 3 కేవీఏ, 5 కేవీఏ, 15 కేవీఏ సామర్థ్యంతో లభిస్తాయి. ధర రూ. 74,999 నుంచి రూ. 1,74,999 వరకు ఉంటుంది. సాంప్రదాయ ఇన్వర్టర్ల కన్నా మెరుగ్గా ఏసీలు, ఇతరత్రా ఉపకరణాలను కూడా ఉపయోగించుకునేందుకు అవసరమైనంత విద్యుత్‌ను ఇవి బ్యాకప్‌గా అందించగలవు.
వీటికి బుకింగ్స్ ఏప్రిల్ 1 నుంచి, డెలివరీలు ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ దొంగారి తెలిపారు. వీటిని పునరుత్పాదక విద్యుత్‌కు కూడా అనుసంధానించుకోవచ్చని పేర్కొన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం (4 ఎండబ్ల్యూహెచ్ సామర్థ్యంతో) ప్యూర్‌పవర్ గ్రిడ్ ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
దేశీయంగా పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం, మొత్తం వాహనాల్లోఈవీల వాటాను 40 శాతానికి పెంచుకోవాలనేది లక్ష్యమని చెప్పారు.