సానుకూలతలు కనిపిస్తున్నాయ్‌.. రికవరీ కొనసాగొచ్చు! | Positives are seen forecast for this weeks market | Sakshi
Sakshi News home page

సానుకూలతలు కనిపిస్తున్నాయ్‌.. రికవరీ కొనసాగొచ్చు!

Oct 9 2023 8:21 AM | Updated on Oct 9 2023 9:38 AM

Positives are seen forecast for this weeks market - Sakshi

ముంబై: దేశీయ సూచీలు ఈ వారం కార్పొరేట్‌ క్యూ2 ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా కదలాడొచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌ ఆస్కారం ఉన్నందున ఒడిదుడుకులకు అవకాశం లేకపోలేదంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి కదలికలు, క్రూడాయిల్‌ ధరల కదిలికలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు.

గతవారం మొత్తంగా సెన్సెక్స్‌ 167 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయాయి. ఆటో, బ్యాంకులు, ఇంధన, ఫార్మా, ఆయిల్‌ – గ్యాస్‌ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెక్నాలజీ, రియల్టీ షేర్లు రాణించాయి.  ‘‘క్రూడాయిల్‌ ధరల రికవరీ, ఆర్‌బీఐ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక డేటా నమోదు పరిణామాల నుంచి దలాల్‌ స్ట్రీట్‌ కొంత సానుకూలత మూటగట్టుకుంది. కావున ఈ వారం రికవరీ కొనసాగొచ్చు.

వచ్చే వారం ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల క్వార్టర్‌ ఫలితాల ప్రకటన ప్రారంభం  నేపథ్యంలో ఈ రంగానికి చెందిన షేర్లపై అధిక ఫోకస్‌ ఉంటుంది. కొనుగోళ్ల మద్దతు కొనసాగితే నిఫ్టీ మరోసారి 19,800 – 20,000 పాయింట్ల పరిధిని పరీక్షింవచ్చు. అమ్మకాలు నెలకొంటే 19,300 వద్ద తక్షణ మద్దతు నెలకొని ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ సీనియర్‌ సాంకేతిక నిపుణుడు పర్వేష్‌ గౌర్‌ తెలిపారు. 

కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ మొదలు 
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఈ అక్టోబర్‌ 11న(బుధవారం) సెప్టెంబర్‌ 30 నాటితో ముగిసిన క్యూ2 ఆర్థిక ఫలితాలను ప్రకటించి కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌కు తెరతీయనుంది. మరుసటి రోజు గురువారం హెచ్‌సీఎల్‌ టెక్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కంపెనీలు ఫలితాలు వెల్లడించనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్యూరెన్స్‌13న, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 14న, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 15న రిజల్ట్స్‌ ప్రకటించనున్నాయి. బ్యాంక్స్, ఆటో, అయిల్‌ మార్కెట్‌ కంపెనీల మెరుగైన పనితీరుతో నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి క్యూ2లో 21–23% గా నమోదవ్వొచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 

ప్రపంచ పరిణామాలు... స్థూల ఆర్థిక డేటా   
జపాన్‌ ఆగస్టు కరెంట్‌ అకౌంట్‌ డేటా, అమెరికా ఆగస్టు హోల్‌సేల్‌ నిల్వల గణాంకాలు మంగళవారం విడుదల అవుతాయి. అమెరికా పీపీఐ ద్రవ్యోల్బణ డే టా, ఫెడ్‌ రిజర్వ్‌ సమా వేశ వివరాలు, చైనా సెప్టెంబర్‌ వాహన విక్ర యాలు బుధవారం వెల్ల డి కానున్నాయి. భారత, యూఎస్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు యూఎస్‌ నిరుద్యోగ డేటా గురవారం విడుదల అవుతుంది. వారాంతాపు రోజు భారత డబ్ల్యూపీ ద్రవ్యోల్బణం, బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ గణాంకాలు వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల స్థితిగతులను తెలియజేసే కీలక స్థూల ఆర్థిక డేటా వెల్లడి మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకోవచ్చు. 

వారంలో రూ.8 వేల కోట్లు వెనక్కి.. 
దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ అక్టోబర్‌ నెలలో మొదటి వారం రోజుల్లోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 8,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా డాల ర్‌ విలువ, బాండ్లపై రాబడులు స్థిరంగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.ఎఫ్‌పీఐలు ఇప్పట్లో భారత మార్కెట్లలో కొనుగోళ్లకు దూరంగా ఉండొచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ తెలిపారు.

డిపాజిటరీ డేటా ప్రకారం, గత నెలలో ఎఫ్‌పీఐ లు రూ. 14,767 కోట్ల విలువైన షేర్ల అమ్మారు. మార్చి – ఆగస్టు మధ్య రూ. 1.74 లక్షల కోట్ల నిధులను మార్కెట్లలో పెట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల మొత్తం పెట్టుబడి రూ. 1.12 లక్షల కోట్లకు చేరగా, డెట్‌ మార్కెట్లో రూ. 31,200 కోట్లకు పైగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement