పర్యావరణ అనుకూల పరిష్కారాలు కావాలి

PM Modi On Auto Industry Push For Greener Alternatives - Sakshi

ఇంధన స్వావలంబనకు తోడ్పడాలి 

ఆటో రంగానికి ప్రధాని మోదీ సూచన 

ఆర్థికాభివృద్ధిలో ఆటో రంగం పాత్రకు ప్రశంసలు 

న్యూఢిల్లీ: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, దేశ స్వావలంబనకు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహన ఆవిష్కరణలపై ఆటోమొబైల్‌ పరిశ్రమ దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) 62వ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. దీన్ని సియామ్‌ ప్రెసిడెంట్‌ కెనిచి అయుకవ చదవి వినిపించారు.

ప్రతి రంగంలోనూ స్వావలంబన సాధించాల్సిన అమృత కాల అవకాశం మన ముందుందని పేర్కొంటూ, అందుకు ఆటోమొబైల్‌ రంగం కూడా అతీతం కాదన్నారు. ఉపాధి కల్పన, దేశ సమగ్ర ఆర్థికాభివృద్ధిలో ఆటోమొబైల్‌ పరిశ్రమ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఆటోమొబైల్‌ రంగానికి భవిష్యత్తు బ్లూప్రింట్‌ను అభివృద్ధి చేసే విషయంలో పరిశ్రమ నిపుణులు, తయారీదారులు, విధానకర్తలు వార్షిక సదస్సులో భాగంగా చర్చలు నిర్వహించాలని సూచించారు.

వాహన తయారీలో నాలుగో అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించడంలో పరిశ్రమ పాత్రను మెచ్చుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, ఆటోమొబైల్‌ పరిశ్రమ సాధించిన ఈ విజయాలు దేశ ఆర్థిక పునరుజ్జీవానికి తోడ్పడినట్టు చెప్పారు. తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. మానవాభివృద్ధిలో రవాణా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ వృద్ధికి నాణ్యమైన, సౌకర్యమైన రవాణా కీలకమన్నారు.  

నాణ్యత ముఖ్యం.. ధర కాదు: గడ్కరీ 
వాహన తయారీ సంస్థలు నాణ్యతకే ప్రాముఖ్యం ఇవ్వాలి కానీ, ధరకు కాదని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఎందుకంటే వాహనదారుల ప్రాధాన్యతలు మారుతున్నట్టు చెప్పారు. ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించడం.. రహదారులు, వాహన భద్రతపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో మంత్రి సూచన గమనార్హం. 

ప్రపంచంలో టాప్‌–2లో భారత్‌: సియామ్‌ 
వాహన తయారీలోని ప్రతి విభాగంలోనూ భారత్‌ను ప్రపంచంలోని రెండు అగ్రగామి దేశాల్లో ఒకటిగా వచ్చే 25 ఏళ్లలో చేర్చడమే తమ లక్ష్యమని సియామ్‌ ప్రకటించింది. 

సియామ్‌ కొత్త ప్రెసిడెంట్‌గా వినోద్‌ అగర్వాల్‌
ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) నూతన ప్రెసిడెంట్‌గా 2022–23 సంవత్సరానికి వినోద్‌ అగర్వాల్‌ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ కెనిచి అయుకవ ఈ బాధ్యతలు నిర్వహించారు. వినోద్‌ అగర్వాల్‌ వోల్వో ఐచర్‌ కమర్షియల్‌ వెహికల్స్‌కు ఎండీ, సీఈవోగా పనిచేస్తున్నారు. సియామ్‌ నూతన వైస్‌ ప్రెసిడెంట్‌గా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర ఎన్నికయ్యారు. దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ 
సీఈవో, ఎండీ సత్యకమ్‌ ఆర్యను ట్రెజరర్‌గా సియామ్‌ ఎన్నుకుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top