Phone Pay: ఫోన్‌పేలో ఉచితాలకు కోత.. ఈ సర్వీసులకు మొదలైన బాదుడు..

PhonePe Starts Charging For Mobile Recharges - Sakshi

Phone Pay User Charges: ఆన్‌లైన్‌ ట్రాన్సాక‌్షన్స్‌కి సంబంధించి ఇండియాలో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న ఫోన్‌పే వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. ఇంతకాలం యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సర్వీసులకు సంబంధించి ఉచితంగా అందించిన సర్వీసులకు ఇ‍ప్పుడు యూజర్‌ ఛార్జీలను వసూలు చేస్తోంది.

ప్రభుత్వ ఆధీనంలో పెట్రోలు డీజిలు ధరలు పెరుగుతున్నాయి. ఇదే బాటలో ప్రైవేటు రంగంలోని డీటీహెచ్‌, ప్రైమ్‌ వీడియోల సబ్‌స్క్రిప్షన్స్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఫోన్‌పే వచ్చి చేరింది. ఇంత కాలం ఉచితంగా అందించిన సర్వీసులకు యూజర్‌ ఛార్జీలను చేర్చింది. వినియోగదారులకు నేరుగా ఈ విషయం చెప్పకుండానే బాదుడు మొదలు పెట్టింది. 

యూజర్‌ ఛార్జీలు
ఇప్పటి వరకు ఫోన్‌పే ద్వారా బ్యాంకు చెల్లింపులు, గ్యాస్‌ బుకింగ్‌, మనీ ట్రాన్స్‌ఫర్‌, మొబైల్‌ రీఛార్జ్‌ వంటి సేవలన్నీ ఉచితంగా అందేవి. అయితే ఇటీవల పెద్దగా హడావుడి చేయకుండానే యూజర్‌ ఛార్జీల విధానాన్ని ఫోన్‌పే ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా మొబైల్‌ రీఛార్జీల విషయంలో వినియోగదారుల నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తోంది. 

బాదుడు ఇలా
మొబైల్‌ రీఛార్జీలకు సంబంధించి రూ.50లోపు ఉన్న రీఛార్జీ సేవలను గతంలోలాగానే ఉచితంగా అందిస్తోంది. కానీ రూ. 50 నుంచి 100ల మధ్యన రీఛార్జ్‌ చేస్తే ఒక రూపాయి యూజర్‌ సర్వీస్‌ ఛార్జ్‌ని వసూలు చేస్తోంది. 100కు మించి ఉన్న రీఛార్జ్‌లకు రెండు రూపాయల వంతున యూజర్‌ ఛార్జీలుగా ఫోన్‌పే విధించింది. 

కవరింగ్‌
మొబైల్‌ రీఛార్జీ యూజర్‌ చార్జీలకు సంబంధించిన వివరాలను ఫోన్‌పే పెద్దగా ప్రచారం చేయడం లేదు. పైగా ప్రయోగాత్మకంగా యూజర్‌ ఛార్జీలు తీసుకుంటున్నాం. కేవలం కొద్ది మంది మాత్రమే యూజర్‌ ఛార్జీల పరిధిలోకి వస్తున్నారంటూ కవరింగ్‌ ఇస్తోంది.

మార్కెట్‌ లీడర్‌ కానీ
సెప్టెంబరులో దేశవ్యాప్తంగా ఫోన్‌పే ద్వారా రికార్డు స్థాయిలో 165 కోట్ల ఆన్‌లైన్‌ ట్రాన్సాక‌్షన్స్‌ జరిగాయి. యూపీఏ సర్వీసులు అందిస్తున్న థర్ట్‌ పార్టీ యాప్‌లలో ఒక్క ఫోన్‌పేనే 40 శాతం వాటాను ఆక్రమించింది. మార్కెట్‌ లీడర్‌గా స్థానం సుస్థిరం చేసుకునే సమయంలో ఫోన్‌పై యూజర్‌ ఛార్జీలు వసూలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీసం యూజర్‌ ఛార్జీలకు సంబంధించి ముందుగా కొంత ప్రచారం చేయాల్సిందని అంటున్నారు. 

చదవండి:ఇలా చేస్తే రూ.5000 ఉచితం..!
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top