ఐపీఓ బాటలో ఫోన్‌పే

PhonePe prepping for IPO - Sakshi

రూ. 62,000–78,000 కోట్ల మధ్య విలువ!

వాల్‌మార్ట్‌ గ్రూప్‌ యూపీఐ దిగ్గజం ప్రణాళికలు

రిజిస్టర్డ్‌ సంస్థను భారత్‌కు తరలించే యోచన

బ్యాంకర్లు, సలహాదారుల ఎంపికకు సై

న్యూఢిల్లీ: గ్లోబల్‌ రిటైలింగ్‌ కంపెనీ వాల్‌మార్ట్‌ గ్రూప్‌లోని యూపీఐ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌కు మెజారిటీ వాటాగల కంపెనీ ఇందుకు బ్యాంకర్లు, న్యాయ సలహాదారు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

ఐపీవో ద్వారా కంపెనీ 8–10 బిలియన్‌ డాలర్ల(రూ. 62,000– 78,000 కోట్లు) విలువను ఆశిస్తున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి. నిధులతో యూపీఐ ఆధారిత చెల్లింపుల నిర్వహణతోపాటు ఫైనాన్షియల్‌ సర్వీసుల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే ప్రణాళికలున్నట్లు పేర్కొన్నాయి. మేడిన్‌ ఇండియా సంస్థగా ఆవిర్భవించే బాటలో రిజిస్టర్డ్‌ హోల్డింగ్‌ సంస్థను సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్చే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఫోన్‌పే బోర్డు అనుమతించడం గమనార్హం!

దేశీయంగా ఊపిరి
ఇటీవల పలు కంపెనీలు విదేశాలలో లిస్టింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటే డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే మాత్రం దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. స్నేహపూర్వక వ్యాపార నియంత్రణలు, పన్ను చట్టాలు గల యూఎస్‌ లేదా సింగపూర్‌లో లిస్టింగ్‌కు పలు స్టార్టప్‌లు చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్‌పేను నిజానికి ఫ్లిప్‌కార్ట్‌ మాజీ ఎగ్జిక్యూటివ్స్‌ సమీర్‌ నిగమ్, రాహుల్‌ చారి, బర్జిన్‌ ఇంజినీర్‌ ఏర్పాటు చేశారు. తదుపరి 2016లో ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేసింది. 2018లో ఫోన్‌పే సహా ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ సొంతం చేసుకుంది.  

2023కల్లా...
ఫోన్‌పే లాభాల్లోకి ప్రవేశించిన వెంటనే పబ్లిక్‌ ఇష్యూ చేపట్టాలని చూస్తున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి. 2023కల్లా టర్న్‌అరౌండ్‌ కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా యూపీఐ లావాదేవీలు జోరందుకోవడంతో ఈ డిసెంబర్‌కల్లా సిబ్బంది సంఖ్యను 5,200కు చేర్చుకునే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం 2,600 మంది ఉద్యోగులను కలిగిన ఫోన్‌పే మరో 2,800 ఉపాధి అవకాశాలకు తెరతీసినట్లు తెలుస్తోంది.   

భారీ విలువలో
ప్రమోటర్లు ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌ల నుంచి ఫోన్‌పే 70 కోట్ల డాలర్లు సమీకరించింది. దీంతో 2020లో కంపెనీ విలువ 5.5 బిలియన డాలర్లకు చేరింది. ఈ బాటలో టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్, టెన్సెంట్‌ తదితర దిగ్గజాల నుంచి 1.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. యూపీఐ విభాగంలో నెలవారీ లావాదేవీల్లో కంపెనీ 47 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రపథంలో ఉంది. వెల్త్‌డెస్క్, ఓపెన్‌క్యూ, గిగ్‌ఇండియాలను కొనుగోలు చేసిన కంపెనీ మ్యూచువల్‌ ఫండ్, ఎన్‌బీఎఫ్‌సీలైసెన్సులకు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం ఎంఎఫ్‌ పంపిణీ లైసెన్స్‌ను కలిగి ఉంది. వెల్త్‌మేనేజ్‌మెంట్‌ ప్రొడక్టుల్లో భాగంగా స్టాక్స్, ఈటీఎఫ్‌లను జమ చేసుకుంటోంది. బంగారంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ యూపీఐ సిప్‌ను ప్రవేశపెట్టింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top