
ఏప్రిల్‌లో 3.49 లక్షల విక్రయాలు
ద్వి చక్రవాహన అమ్మకాల్లో రెండంకెల క్షీణత
భారత వాహన తయారీదార్ల సంఘం సియామ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ప్రయాణికుల వాహనాల టోకు అమ్మకాలు ఏప్రిల్‌లో 4% పెరిగి 3,48,847 యూనిట్లకు చేరుకున్నాయని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్) వెల్లడించింది. 2024 ఏప్రిల్‌లో విక్రయాలు 3,35,629 వాహనాలతో పోలిస్తే ఇవి 4% అధికంగా ఉన్నాయి. ద్వి చక్రవాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 17% క్షీణించి 17,51,393 నుంచి 14,58,784 యూనిట్లకు తగ్గాయి. ఇందులో మోటార్ సైకిల్ సరఫరా 23% తగ్గి 8,71,666 యూనిట్లకు దిగివచ్చాయి.
స్కూటర్ అమ్మకాలు 5,81,277 నుంచి 5,48,370 యూనిట్లకు; మోపెడ్ విక్రయాలు 41,924 నుంచి 38,748 యూనిట్లకు తగ్గాయి. త్రిచక్రవాహన విక్రయాలు సైతం స్వల్పంగా 0.75% తగ్గి 49,441 యూనిట్లకు దిగివచ్చాయి. ‘‘ ప్యాసింజర్ వాహన విభాగం ఏప్రిల్ 2025లో ఇప్పటివరకు అత్యధికంగా 3.49 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఏప్రిల్ 2024తో పోలిస్తే 3.9 శాతం ఎక్కువ. అధిక బేస్ ప్రభావం అమ్మకాలపై పడటంతో ద్విచక్రవాహన విభాగం రెండంకెల క్షీణతను చవిచూసింది. రానున్న నెలల్లో తిరిగి పుంజుకునే వీలుంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.