
కొత్త జీఎస్టీ విధానంతో ధరలు తగ్గొచ్చనే ఆశావహ అంచనాలతో కస్టమర్లు వాహన కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఆగస్టులో ఆటో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వాహన రంగం అత్యధిక పన్ను రేటు 28% శ్లాబులో ఉంది. వాహన రకాన్ని బట్టి 1–22% పరిహార సెస్ విధిస్తున్నారు.
చిన్న పెట్రోల్ కార్లపై 29% నుంచి ఎస్‌యూవీలపై 50% వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. జీఎస్‌టీ 2.0 విధానంలో అన్ని వాహనాలను ఒకే శ్లాబులోకి ఉంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో కస్టమర్లు జీఎస్‌టీ ప్రకటన వెలువడే వరకు వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. మారుతీ సుజుకీ దేశీయంగా ఆగస్టులో 1,31,278 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో అమ్ముడైన 1,43,075 వాహనాలతో పోలిస్తే 8% తక్కువ. ఎగుమతులతో మొత్తం అమ్మకాలు 1,80,683 యూనిట్లుగా నమోదయ్యాయి.
‘జీఎస్టీ సంస్కరణ ఆటో పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఏదైనా మంచి ఫలితం దక్కాలంటే.., ముందుగా కష్టాన్ని భరించాలి. అందుకే ఆగస్టు నెలలో డీలర్లకు సరఫరా తగ్గింది. జీఎస్‌టీ ప్రకటన తర్వాత పరిస్థితి మారుతుంది. మా వద్ద 1.5 లక్షల వాహన ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. డీలర్ల వద్ద నిల్వలు 48–50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి.’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.
ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..