
విక్రయాలు 5–6% పెరుగుతాయ్
ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 2–3% వృద్ధి
జీఎస్‌టీ తగ్గింపుతో వాహనాలకు భారీ డిమాండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి క్రిసిల్ రేటింగ్స్ అంచనా
ముంబై: జీఎస్‌టీ క్రమబద్ధీకరణ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ద్విచక్ర వాహన విక్రయాల్లో 5–6%, ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 2–3% వృద్ధి నమోదు కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదికలో తెలిపింది. ఈ సెపె్టంబర్ 22 నుంచి 5%, 18% పన్ను శ్లాబులు మాత్రమే అమల్లో ఉంటాయంటూ జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మరింత పుంజుకుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. జీఎస్‌టీ కోతతో దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్‌లో 90% వాల్యూమ్స్ కలిగిన టూ–వీలర్స్, ప్యాసింజర్ వాహనాలకు వరుసగా 2%, 1% డిమాండ్ పెరగనుందని వివరించింది. క్రిసిల్ రేటింగ్స్‌లో మరిన్ని విశేషాలు....
→ కోవిడ్ సంక్షోభం, ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్ టూల్స్ ఐఐ(ఓబీడీ2) తప్పనిసరి అమలు, ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ బైక్‌లకు తగ్గిన డిమాండ్, ప్యాసింజర్ వాహన ధరలు భారీగా పెరగడం తదితర కారణాలతో ఆటో పరిశ్రమ ఇబ్బందులకు లోనవుతోంది. తాజాగా జీఎస్‌టీ కౌన్సిల్ తాజా నిర్ణయంతో వాహనాలకు డిమాండ్ ఊపందుకోవచ్చు.
→ గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడం, సాధారణ వర్షపాత నమోదుతో పాటు ఈ ఏడాదిలో 15కి పైగా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్స్ మార్కెట్లోకి విడుదల పరిణామాలు డిమాండ్ పునరుద్ధరణకు మరింత తోడ్పడవచ్చు. అయితే పండుగ సీజన్‌లో డీలర్ల వద్ద వాడని పన్ను క్రెడిట్ల కారణంగా ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు.
→ అధిక అమ్మకాలు కంపెనీల సామర్థ్య వినియోగం, ఆపరేటింగ్ లీవరేజ్‌ల మెరుగుపరిచే అవకాశం కలిగిస్తుంది. దీని ఫలితంగా ఆటోమొబైల్ కంపెనీలకు బలమైన నగదు ప్రవాహాలు, మెరుగైన లాభాల మార్జిన్లు లభిస్తాయి.
అదేవిధంగా, జీఎస్టీ తగ్గింపు తర్వాత 50–55 రోజుల ప్యాసింజర్ వాహనాల నిల్వలు తగ్గే అవకాశం ఉంది. ఇది వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడిని తగ్గించి, డీలర్ల నగదు
ప్రవాహానికి మద్దతిస్తుంది.
‘‘జీఎస్‌టీ తగ్గింపు లాభాల బదలాయింపుతో వాహన ధరలు 5–10% (చిన్న స్థాయి పీవీలపై రూ.30–60 వేలు, టూ వీలర్స్‌పై రూ.3,000 –7,000 తగ్గింపు) దిగివచ్చే వీలుంది. దీనికి తోడు పండుగ సీజన్, ఆటో కంపెనీలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన కొనుగోలు సామర్థ్యం తదితర అంశాలు కలిసొచ్చి ఈ ద్వితీయార్థంలో ఆటో పరిశ్రమ దూసుకెళ్తుంది’’ అని క్రిసిల్ రేటింగ్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేత్ తెలిపారు.
ఆటో పరిశ్రమపై జీఎస్‌టీ తగ్గింపు: కొత్త జీఎస్‌టీ ప్రకారం చిన్న కార్లు, 350 సీసీలోపు మోటార్‌సైకిళ్లపై 18 శాతం జీఎస్ పడనుంది. మధ్య, భారీ ప్యాసింజర్ వాహనాలపై పన్ను 3–7 శాతం వరకు తగ్గనుంది. ట్రాక్టర్లను సైతం 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. సంక్షిప్తంగా చిన్న కార్లు, బైకులు(350 సీసీ) ధరలు భారీగా తగ్గనున్నాయి. పెద్ద కార్లు, ఎస్‌యూవీలు కొద్దిమేర చవకగా మారాయి. అయితే పెద్ద (హై ఎండ్)బైకులు ధరలు భారీగా పెరిగాయి.
జీఎస్‌టీ తగ్గింపు తర్వాత వాహన ధరలు: జీఎస్‌టీ తగ్గింపు లాభాలు పూర్తి స్థాయి ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలీ చేస్తే ధరలు 5 నుంచి 10% తగ్గుతాయి. చిన్న కార్లు రూ.60వేల వరకు, త్రీ వీలర్స్ రూ.15,000 నుంచి రూ.20వేల వరకు తగ్గొచ్చు. మీడియం, హెవీ వాణిజ్య వాహన ధరలు రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షల తగ్గొచ్చు. యథావిథిగా 5% జీఎస్‌టీ కొనసాగింపుతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్, త్రీ వీలర్స్ వాహన ధరలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు.