2027 మార్చి నాటికి రూ.50 లక్షల కోట్లు
క్రిసిల్ రేటింగ్స్ అంచనా
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) తమ నిర్వహణ ఆస్తుల్లో 18 శాతం వృద్ధిని కొనసాగిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కొన్ని విభాగాల్లో రుణపరమైన ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈమేరకు వృద్ధి సాధ్యమేనని పేర్కొంది.
మొత్తం మీద ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 2027 మార్చి నాటికి రూ.50 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. కస్టమర్ లెవరేజ్ అధికమైన నేపథ్యంలో (సామర్థ్యానికి మించి రుణ భారం) ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ, అన్‌సెక్యూర్డ్ రుణ విభాగాల్లో ఎన్‌బీఎఫ్‌సీలు రిస్క్‌ను సమతుల్యం చేస్తూ వృద్ధిని సాధించడంపై దృష్టి సారిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు.
వ్యక్తిగత రుణాల్లో 25 శాతం వృద్ధి..
→ వ్యక్తిగత రుణాలలో (ఎన్‌బీఎఫ్‌సీ ఏయూఎంలో 11 శాతం) వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 18 శాతం నుంచి 22–25 శాతానికి పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. 2023–24లో నమోదైన 37 శాతం వృద్ధి కంటే తక్కువేనని పేర్కొంది.
→ జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లో ఉండడం రిటైల్ రుణాల డిమాండ్‌ను పెంచుతుందని తెలిపింది.
→ ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో అన్‌సెక్యూర్డ్ ఎంఎస్‌ఎంఈ రుణాలు 6 శాతంగా ఉంటాయంటూ, ఇందులో సకాలంలో చెల్లింపులు చేయని రుణాలు పెరుగుతున్నట్టు పేర్కొంది. దీని ఫలితంగా ఏయూఎంలో వృద్ధి గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఉన్న 31 శాతం నుంచి 13–14 శాతానికి తగ్గనున్నట్టు వెల్లడించింది.
→ ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో 15 శాతం వాటా కలిగిన లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (ప్రాపర్టీ తనఖాపై రుణం) రుణాల్లో 26–27 శాతం వృద్ధి ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో నమోదు అవుతుందని అంచనా వేసింది. – బంగారం రుణ విభాగం (ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎంలో 6 శాతం) ఇక ముందూ బలమైన వృద్ధిని కొనసాగిస్తుందని తెలిపింది. బంగారం రుణ మార్కెట్ అసంఘటిత రంగం నుంచి సంఘటితం వైపు మళ్లుతుండడం, ఈ విభాగం విస్తరణకు మద్దతునిస్తుందని పేర్కొంది.


