 
													భారత కంపెనీల ఆదాయం, సెప్టెంబర్ త్రైమాసికంలో.. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 5 - 6 శాతం పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. లాభదాయకత అర శాతం వరకు తగ్గొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. నిర్వహణ మార్జిన్లు 0.60 శాతం తక్కువ నమోదు కావొచ్చని తెలిపింది. విద్యుత్, బొగ్గు, ఐటీ సేవలు, ఉక్కు రంగాల్లో మెరుగైన పనితీరు ఆదాయ వృద్ధికి అనుకూలిస్తుందని పేర్కొంది. 600 కంపెనీల పనితీరును విశ్లేషించి అనంతరం క్రిసిల్ రేటింగ్స్ ఈ వివరాలను విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే కంపెనీల ఆదాయం ఒక శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది.
రంగాల వారీ పనితీరు అంచనా..
- ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, అల్యూమినియం రంగాల్లో పెరిగిపోయిన ముడిపదార్థాల వ్యయాలను కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేసే విషయంలో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో నిర్వహణ లాభాల మార్జిన్ 0.50–1 శాతం వరకు తగ్గొచ్చు. 
- ఐటీ రంగంపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం కొనసాగుతోంది. ప్రాజెక్టులు వాయిదా పడుతుండడంతో ఆదాయ వృద్ధి ఒక శాతం మించకపోవచ్చు. 
- స్టీల్ రంగంలో ఆదాయం 4 శాతం వరకు పెరగొచ్చు. ధరలు తగ్గడంతో అమ్మకాల పరిమాణం 9 శాతం అధికంగా ఉండొచ్చు. 
- విద్యుత్ రంగంలో కంపెనీల ఆదాయం ఒక శాతం మెరుగుపడుతుంది. అధిక వర్షపాతంతో జలవిద్యుత్ తగినంత ఉత్పత్తి కావడం, పునరుత్పాదక విద్యుత్ 10 శాతం పెరగడం ఆదాయ వృద్ధిని పరిమితం చేయొచ్చు. దీంతో బొగ్గు రంగం ఆదాయం ఫ్లాట్‌గా ఉండొచ్చు. 
- అమ్మకాలు 31 శాతం పెరగడంతో ట్రాక్టర్ల తయారీదారుల ఆదాయం 36 శాతం అధికం కావొచ్చు. ద్విచక్ర వాహన కంపెనీల ఆదాయం 9 శాతం (అమ్మకాలు 6 శాతం పెరగడం వల్ల) పెరగొచ్చు. 
- టెలికం కంపెనీలు 7 శాతం వరకు ఆదాయంలో వృద్ధిని చూపించొచ్చు. చందాదారుల వృద్ధి ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, అధిక టారిఫ్‌లతో కూడిన ప్లాన్లు ఇందుకు అనుకూలిస్తాయి. 
- సిమెంట్ అమ్మకాలు 6–7 శాతం వృద్ది చెందడంతో.. కంపెనీల ఆదాయం 8 శాతం వరకు పెరుగుతుంది. 
- ఫార్మాస్యూటికల్ కంపెనీల మార్జిన్లు 1.5–2 శాతం వరకు, అల్యూమినియం కంపెనీల మార్జిన్లు 1–1.5 శాతం వరకు తగ్గుతాయి. 
- సిమెంట్, స్టీల్, టెలికం కంపెనీల మార్జిన్లు మెరుగుపడతాయి. 
గ్రామీణ ప్రాంతాల్లో సానుకూలత
‘‘జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణతో కొత్త ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్యాసింజర్ వాహనాలు, ఎఫ్‌ఎంసీజీ రంగంలో తాత్కాలిక అవరోధాలు నెలకొన్నాయి. రిటైలర్లు, పంపిణీదారులు ఎఫ్‌ఎంసీజీ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. అప్పటికే నిల్వలు ఉండడం, రిటైల్ అమ్మకాలు స్తబ్దుగా ఉండడం క్యూ2లో ప్యాసింజర్ వాహనాల డిమాండ్‌పై ప్రభావం చూపించింది. వర్షాలు సమృద్ధిగా పడడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించింది. ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను పెంచడంతో రైతుల్లో సానుకూల సిమెంట్ నెలకొంది. ఇది ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయాలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పూషణ్ శర్మ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
