టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ మునుపెన్నడూలేని విధంగా భారీగా లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంది. కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ విభాగాల్లో రికార్డు స్థాయి వృద్ధిని, బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేస్తున్నప్పటికీ.. ఏకంగా 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తుండటం ఐటీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 18 శాతం మందిని తొలగించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ ఉద్వాసనకు ప్రభావితమైన ఉద్యోగుల అధికారిక పీరియడ్ జూన్ 1 నుంచి జూన్ 15 మధ్య ముగియనుంది.
లాభాల బాటలో ఒరాకిల్..
వ్యాపార పరంగా ఒరాకిల్ వృద్ధిని కనబరుస్తున్న తరుణంలోనే ఈ లేఆఫ్స్ నిర్ణయం రావడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. ఏడాది ప్రాతిపదికన 22 శాతం వృద్ధి చెంది 17.2 బిలియన్ డాలర్ల లాభం నమోదైంది. క్లౌడ్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 44 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఏఐ అప్లికేషన్ల అభివృద్ధికి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఐ విభాగం ఏకంగా 243 శాతం, మల్టీక్లౌడ్ డేటాబేస్ ఆదాయం 531 శాతం వృద్ధిని సాధించాయి.
ఉద్యోగాలను ఎందుకు తగ్గిస్తోంది?
రికార్డు లాభాలు వస్తున్నప్పటికీ ఒరాకిల్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహాత్మక పునర్నిర్మాణ ప్రణాళిక ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ విభాగాల నుంచి వనరులను తగ్గించి, వాటిని పూర్తిగా ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ విస్తరణ వైపు మళ్లించాలని ఒరాకిల్ భావిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 50 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాన్ని కేటాయించింది. ఇందులో అధికంగా ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకే ఖర్చు చేయనున్నారు. ఓపెన్‌ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్ మద్దతుతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భారీ స్థాయి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ‘స్టార్ గేట్’లో ఒరాకిల్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
సెవెరెన్స్ ప్యాకేజీపై అసంతృప్తి
ఒకవైపు కంపెనీ భారీ లాభాలను ప్రకటిస్తూ మరోవైపు ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీ ఆఫర్ చేసిన సెవెరెన్స్ (విడదీత) ప్యాకేజీ నిబంధనలపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. అన్‌వెస్టెడ్ (ఇంకా చేతికి రాని) స్టాక్ అవార్డుల విషయంలో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఒరాకిల్ అందిస్తున్న సెవెరెన్స్ ప్యాకేజీలో పదవీకాలం ఆధారిత పరిహారాన్ని గరిష్టంగా 26 వారాలకే పరిమితం చేశారు.
ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!


