5జీకి కస్టమర్లు సిద్ధంగా లేరు

Only 5percent want to upgrade to 5G services says Localcircles survey - Sakshi

ఈ ఏడాదికి 5 శాతమే ఆసక్తి

లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు ఎట్టకేలకు భారత్‌లో ప్రారంభం అయ్యాయి. 50 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ యూజర్లలో 10 శాతం మంది వద్ద ఇప్పటికే 5జీ హ్యాండ్‌సెట్స్‌ ఉన్నాయి. అయితే ఈ ఏడాది 5జీ సేవలకు మళ్లేందుకు కేవలం 5 శాతం మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారని కమ్యూనిటీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 318 జిల్లాల్లో చేపట్టిన ఈ సర్వేలో 29,000 పైచిలుకు మంది మొబైల్‌ యూజర్లు పాలుపంచుకున్నారు. వీరిలో 64 శాతం పురుషులు, 36 శాతం మహిళలు ఉన్నారు. ప్రథమ శ్రేణి నగరాల నుంచి 47 శాతం, ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు 34 శాతం, మిగిలినది ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు.  

అదనపు చెల్లింపులకు నో..
ప్రతి నెల 5జీ సేవల కోసం అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించేందుకు సిద్ధంగా లేమని 43 శాతం మంది తేల్చిచెప్పారు. ప్రస్తుత 3జీ/4జీ టారిఫ్‌లోనే 5జీ సేవలు ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు. 43 శాతం మంది మాత్రం కేవలం 0–10 శాతం ఎక్కువ చెల్లించేందుకు రెడీ అని వెల్లడించారు. 10–25 శాతం అధికంగా ఖర్చు చేయడానికి 10 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపారు. అయితే 4జీ హ్యాండ్‌సెట్స్‌ వాడుతున్నప్పటికీ కాల్‌ నాణ్యత మెరుగుపడలేదు. ఇంటర్నెట్‌ వేగం పెద్దగా పెరగలేదు. ఈ నేపథ్యంలో 5జీని సపోర్ట్‌ చేసే గ్యాడ్జెట్ల కోసం అదనంగా ఖర్చు చేయాలా వద్దా అని వినియోగదార్లు ఆలోచిస్తున్నారు.  

పరిష్కారం అయ్యాకే..
సర్వేలో పాల్గొన్నవారిలో 20 శాతం మంది వద్ద 5జీ హ్యాండ్‌సెట్స్‌ ఉన్నాయి. ఈ ఏడాది 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొంటామని 4 శాతం మంది చెప్పారు. వచ్చే ఏడాది కొనుగోలు చేస్తామని 20 శాతం మంది తెలిపారు. సమీప కాలంలో అప్‌గ్రేడ్‌కు ఆసక్తిగా లేమని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాల్‌ డ్రాప్‌/కనెక్ట్, నెట్‌వర్క్‌ అందుబాటులో లేకపోవడం, తక్కువ వేగం వంటి సమస్యలకు 5జీ ద్వారా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టు 39 శాతం మంది తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యాకే 5జీకి మళ్లేందుకు సిద్ధమని 39 శాతం మంది స్పష్టం చేశారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top