స్టూడెంట్స్, టీచర్స్ కి వన్ ప్లస్ బంపర్ ఆఫర్

OnePlus Launched Education Benefits Program For Students and Teachers - Sakshi

న్యూఢిల్లీ: భారత్ లో మార్చిలో లాక్ డౌన్ విధించినప్పటి నుండి అన్ని కార్యకలపాలు ఇంటి నుండే జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ లాక్ డౌన్ కాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని నెలల తర్వాత దశల వారీగా కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇస్తూ వచ్చింది. అప్పటి నుండి కళాశాలలు ఆన్‌లైన్‌లోనే విధ్యా బోధన చేస్తున్నాయి. ఈ దశలో స్మార్ట్ ఫోన్ వినియోగం భాగా పెరిగింది. వారి అవసరాలను గుర్తించిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ మనదేశంలో ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక లాభాలను అందించనున్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా 760 విశ్వవిద్యాలయాలను, 38,498 కాలేజీలను కవర్ చేస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో ఎవరైనా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. దీంతోపాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లే వారికి వన్ ప్లస్ యాక్సెసరీల కొనుగోలుపై ఐదు శాతం తగ్గింపును అందించనున్నారు. 

ఈ ఆఫర్‌ను పొందాలంటే అర్హత ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు తాము విశ్వవిద్యాలయం లేదా కాలేజీకి వెళ్తున్నామని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ధ్రువీకరణ కోసం వన్ ప్లస్ స్టూడెంట్ బీన్స్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆ వినియోగదారుల వన్‌ప్లస్ ఖాతాకు కూపన్ వోచర్‌ను పంపిస్తారు. అర్హత ఉన్న వినియోగదారులు అక్కడ ధ్రువీకరించుకోవచ్చు. ఎన్‌రోల్ చేసుకున్న విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుకోవడానికి అర్హులు. ఈ లాభాన్ని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వన్ ప్లస్ ఆడియో డివైస్‌లు, కేసెస్‌పై ఐదు శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వోచర్‌ను కేవలం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు మాత్రమే ఉపయోగించుకోగలరు. సంవత్సరం తర్వాత ఈ వోచర్ ఎక్స్‌పైర్ అవుతుంది. ఎక్స్‌పైర్ అయ్యాక కొత్త వోచర్ కోసం మళ్లీ ధ్రువీకరించుకోవాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top