ఓలాకు పోటీగా తెలంగాణలో భారీ ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్..!

One Moto To Set Up EV Manufacturing Unit In Telangana - Sakshi

ప్రముఖ బ్రిటన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ వన్ మోటో ఓలాకు పోటీగా తెలంగాణలో భారీ ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనపూర్వక ఒప్పందం(ఎంఒయు) కుదర్చుకుంటున్నట్టు తెలిపింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివార్లలోని 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఇక్కడ కొత్త తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఈ కంపెనీ బ్రాండ్ ₹250 కోట్ల మేర పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి సెమీ-రోబోటిక్స్‌ వంటి అదునాతన యంత్రాలతో కర్మాగారం నిర్మిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో ప్రకటించింది. 

3 స్కూటర్లను లాంచ్ చేసిన కంపెనీ
ఈ బ్రిటన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గత రెండు నెలల కాలంలోనే తన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి స్పెసిఫికేషన్స్ చూస్తే ఇతర కంపెనీలకు పోటీ ఇచ్చే విధంగా ఉన్నాయి. వన్ మోటో తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలెక్టాను ధర రూ.2 లక్షలు(ఎక్స్ షోరూమ్)కు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్ళే సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ కంపెనీ మరొక మోడల్ బైకా ధర ₹1.80 లక్షలు కాగా, కమ్యుటా ఈ మూడింటిలో అత్యంత సరసమైనది ₹1.30 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది.

ఈ సందర్భంగా వన్ మోటో ఇండియా సీఈఒ శుభంకర్ చౌదరి మాట్లాడుతూ.. "కొత్త తయారీ ప్లాంట్‌తో మేము భారతదేశంలోని వినియోగదారులకు సేవలందించడమే కాకుండా, వన్ మోటో అభివృద్ధి చేస్తున్న వాహనలను ఇతర ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. కేవలం తయారీ కేంద్రంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు సృష్టించడానికి ఇది అద్భుతమైన అవకాశం. ఈవీ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కోసం ప్రత్యేక నైపుణ్యం గల మానవ వనరులు అవసరం గనుక మేం రాష్ట్రంతో నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తాం. ఈ-మొబిలిటీని ప్రోత్సహించే దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ఎదురు చూస్తున్నాము. ఈ ప్లాంట్ వల్ల రాష్ట్రంలో దాదాపు 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 2000 మందికి పరోక్ష ఉద్యోగాలను రానున్నట్లు " అన్నారు.

(చదవండి: బంపరాఫర్‌..! ఉచితంగా రూ. 20 వేల విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్...!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top