లాభాల రోడ్డెక్కిన ఓలా.. ఈసారి లాభం ఎంతంటే? | Sakshi
Sakshi News home page

లాభాల రోడ్డెక్కిన ఓలా.. ఈసారి లాభం ఎంతంటే?

Published Wed, Nov 3 2021 8:13 AM

Ola Announced Rs 90 Crores Management Profits - Sakshi

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్న ట్యాక్సీ సేవల సంస్థ ఓలా తొలిసారిగా నిర్వహణ లాభాలు ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌–19 కట్టడికి లాక్‌డౌన్‌ల అమలుతో ఆదాయం క్షీణించినప్పటికీ స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ. 90 కోట్లు లాభం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం సంస్థ రూ. 610 కోట్ల నష్టం ప్రకటించింది. తాజాగా ఆదాయం 65 శాతం క్షీణించి రూ. 690 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం నష్టం రూ. 1,715 కోట్ల నుంచి రూ. 1,326 కోట్లకు తగ్గింది. ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ ఈ విషయాలు వెల్లడించింది. ఫుడ్‌ డెలివరీ, ఆర్థిక సేవల వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్న ఏఎన్‌ఐ కన్సాలిడేటెడ్‌ ఆదాయంలో .. సింహభాగం వాటా ట్యాక్సీ సేవల విభాగానిదే ఉంది.  

కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ ఆదాయం 63 శాతం క్షీణించి రూ. 983 కోట్లకు తగ్గగా, నిర్వహణ నష్టం రూ. 429 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడంపై కంపెనీ మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. 2020–21లో 1 కోటి మంది దాకా కొత్త యూజర్లు చేరారని, మరిన్ని కొత్త నగరాలకు కార్యకలాపాలు విస్తరిస్తున్నామని, కొత్త ఉత్పత్తులను రూపొందిస్తున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌ ఇటీవలే ప్రకటించారు. ఐపీవో ద్వారా 1–15 బిలియన్‌ డాలర్ల (రూ. 7,324–10,985 కోట్లు) నిధులు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. దీనికి సంబంధించి డిసెంబర్‌ త్రైమాసికంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.   

 

Advertisement

తప్పక చదవండి

Advertisement