అదానీ షేర్లు మళ్లీ పరుగులు పెడుతున్నాయ్‌

Nsdl Has Changed Website Entries Adani Shares Rising  - Sakshi

ముంబై: అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మూడు ఫండ్‌లకు సంబంధించిన గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (జీడీఆర్‌) ఖాతాలను మాతమ్రే స్తంభింపచేసినట్లు నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్‌) వివరణ ఇచ్చింది. దానికి అనుగుణంగానే తమ వెబ్‌సైట్‌లో తగు మార్పులు చేసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లయిన ఎబ్యులా ఇన్వెస్ట్‌మెంట్స్, ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్, క్రెస్టా ఫండ్‌ వీటిలో ఉన్నాయి. తాజా వివరణతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు బుధవారం గణనీయంగా లాభపడ్డాయి.

వివరాల్లోకి వెళితే.. అదానీ గ్రూప్‌ సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసిన ఆరు మారిషస్‌ ఆధారిత ఫండ్స్‌లో మూడింటి ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ స్తంభింపచేసిందన్న వార్తలతో జూన్‌ 14న అదానీ సంస్థల షేర్లు ఏకంగా 25 శాతం దాకా పతనమయ్యాయి. అదానీ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి కాకుండా 2016 జూన్‌ నాటి జీడీఆర్‌ల విషయంలోనే ఆ ఫండ్స్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు ఎన్‌ఎస్‌డీఎల్‌ అప్పట్లోనే తెలిపింది. కానీ తమ వెబ్‌సైట్‌లో స్తంభింపచేసిన 9,444 ఖాతాల జాబితాలో వీటిని కూడా కొనసాగించడం సందేహాలకు తావిచ్చింది. తాజాగా ఆయా ఫండ్స్‌ ’జీడీఆర్‌’లను మాత్రమే ఫ్రీజ్‌ చేసినట్లు పోర్టల్‌లోనూ మార్చడంతో స్పష్టత ఇచ్చినట్లయింది. దీంతో బుధవారం అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ చెరి 4 శాతం, అదానీ పవర్‌ 2 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 0.76 శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ 0.29 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 0.24 శాతం పెరిగాయి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top