‘ప్రైవేట్‌ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman Compares India Inc To Hanuman - Sakshi

న్యూఢిల్లీ: రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కేవలం రూబుల్‌ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికి మించి స్వేచ్ఛా విపణిగా మారగలుగుతోందని మైండ్‌మైన్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి అనంతరం భారత్‌ అనేక వినూత్న ప్రయోగాలను ఆవిష్కరిస్తోందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 

ప్రైవేట్‌ రంగం హనుమంతుడిలాంటిది.. 
విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్‌పై నమ్మకంగా ఉన్నప్పుడు దేశీయంగా ప్రైవేట్‌ సంస్థలు తయారీలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారో తెలియడం లేదని నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. పరిశ్రమకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చించేందుకు, పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. హనుమంతుడిలాగా పరిశ్రమకు తన శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. 

‘పరిశ్రమ హనుమాన్‌లాగా మారిందా? మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం కలగడం లేదా. ఎవరైనా మీ పక్కన నిల్చుని, మీకు హనుమంతుడి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి .. ముందుకు కదలండి అని చెప్పాల్సిన అవసరం ఉందా? అలా హనుమంతుడికి ప్రస్తుతం చెప్పేవారు ఎవరున్నారు. పరిశ్రమ కదిలి వచ్చి ఇన్వెస్ట్‌ చేసేందుకు ఏమేమి చేయగలదో అంతా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ఎందుకు వెనుకాడుతున్నారో మీ నుంచి వినాలని ఉంది‘ అని ఆమె పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top