మూవీ లవర్స్‌కు ఇక పండగే

Netflix Will Be Briefly Free For Indian Users From December 5 - Sakshi

సినిమా వీక్షకులకు శుభవార్త తెలిపింది నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 5, 6 తేదీల్లో మనదేశంలో స్ట్రీమ్ ఫెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ 48 గంటల ఫెస్ట్‌ను డిసెంబర్ 5న తెల్లవారుజామున 12.01 నుండి డిసెంబర్ 6న రాత్రి 11.59 గంటలకు వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది నెట్‌ఫ్లిక్స్. డిసెంబర్‌ 5, 6 తేదీల్లో అభిమానులు ఉచితంగా సినిమాలు, వెబ్‌ సిరీసులు భారతీయ అన్ని భాషల్లోని కంటెంట్‌ను  ఉచితంగా చూడొచ్చని తెలిపింది. మొదటగా దీన్ని మనదేశంలో మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ఒకవేళ విజయవంతం అయితే మిగతా దేశాలలో ప్రవేశపెట్టాలని చూస్తుంది.(చదవండి: వాట్సప్ సేవలు ఇక బంద్) 

భారత ఓటీటీ మార్కెట్లో అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, జీ5 వంటి వాటికీ పోటీగా ఎదిగేందుకే నెట్‌ఫ్లిక్స్‌ రెండు రోజులు ఉచితంగా కంటెంట్‌ను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. రేపటి నుండి ప్రారంభం అయ్యే ఫెస్ట్ లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా చెల్లింపు అవసరం లేదని కంపెనీ ధ్రువీకరించింది. ఈ స్ట్రీమింగ్‌ ఫెస్ట్‌లో కంటెంట్‌ను వీక్షించడానికి మీరు మీ ఇమెయిల్ ఐడీ లేదా పేరు లేదా ఫోన్ నంబర్‌తో సైన్ అప్ చేసుకోవాలి. ఒకరి లాగిన్‌ సమాచారాన్ని మరొకరు ఉపయోగించుకొనేందుకు వీల్లేదని తెలిపారు. 480p రిజల్యూషన్‌తో కంటెంట్ ని స్ట్రీమ్ చేయవచ్చు. 2020 3వ త్రైమాసికంలో ఫలితాలు నెట్‌ఫ్లిక్స్‌కు ఆశాజనకంగా లేవు. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 1.57 కోట్ల కొత్త సబ్ స్క్రైబర్లు రాగా, రెండో త్రైమాసికంలో అది కోటి సబ్ స్క్రైబర్లకు తగ్గింది. ఇప్పుడు మూడో త్రైమాసికంలో ఏకంగా 22 లక్షలకు పడిపోయింది. దీంతో నెట్ ఫ్లిక్స్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త ప్రయోగాలు చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top