కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్‌.. నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేర్‌ చేస్తే పైసలు కట్టాలి!

Netflix Shock To Customers, Plans To Ban Password Sharing From 2023 - Sakshi

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇది వందల కోట్ల నుంచి వేల కోట్ల మార్కెట్‌గా అవతరించింది. ఇందులో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ అత్యంత జనాదరణ పొందడంతో పాటు కాస్త ఖరీదైన ఓటీటీగా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్‌ తన కస్టమర్లకు షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

యూజర్లకు షాక్‌.. నో షేరింగ్‌
సంవత్సరాలుగా, నెట్‌ఫ్లిక్స్ తన చందాదారులను కోల్పోవడానికి పాస్‌వర్డ్ షేరింగ్ ప్రధాన కారణాలలో ఒకటిగా పేర్కొంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంటిని దాటి పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయడం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలకాలని యోచిస్తోందట. ఓటీటీ సంస్థలు ఇప్పటి వరకు పాస్ వర్డ్ షేరింగ్ అవకాశాన్ని కల్పించాయి.

ఒకరికి అకౌంట్‌ ఉంటే సుమారు నలుగురు పాస్ వర్డ్ షేర్ చేసుకునే అవకాశం ఉండేది. ఒక్కరు రీఛార్జ్ చేసుకుంటే మిగతా వారంతా ఉచితంగా కంటెంట్ ను చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఇకపై పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధానికి సంబంధించిన కొత్త విధానాన్ని 2023 లోపు యునైటెడ్ స్టేట్స్‌లో అమలు చేయనుంది. ఆ తర్వాత ఈ రూల్‌ని మిగిలిన దేశాలకు అమల్లోకి తీసుకురావాలిని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తోంది. 

ఇదిలా ఉండగా.. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ బ్యాన్‌ కాకుండా, నెట్‌ఫ్లిక్స్ కొత్త నియమాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూజర్లు వారి సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించి పే-పర్-వ్యూ కంటెంట్‌ను అద్దెకు తీసుకునేలా వీలు కల్పిస్తుంది. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ అతి త్వరలోనే ప్రకటన-ఆధారిత సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రారంభించే ప్లాన్‌లో ఉంది. దీని ట్రయల్స్ 2023లో మొదలుపెట్టేందుకు యోచిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌( Netflix ), అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime), హెచ్‌బీఓ (HBO) వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్‌లో పాస్‌వర్డ్ షేరింగ్ చట్టవిరుద్ధం అని, ఇది తమ కాపీరైట్ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నాయి. మరో వైపు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ రేటు కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లుకు తమ పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేరింగ్‌ చేసుకునే వెసలుబాటును నిలిపేవేయనుంది.

చదవండి: అవును.. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే, ఎందుకో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top