బంగారంపై రుణం అందరికీ ఆమోదమే!

NBFCs offering Gold Loan in India - Sakshi

బంగారంపై రుణం అందరికీ ఆమోదమే!

తక్కువ రేటుపైనే రుణాలు

రుణదాతలకు రిస్క్‌ తక్కువ

సులభంగా రుణాలు లభించే పరిస్థితి

చెల్లింపుల్లోనూ సౌలభ్యం

భారతీయులకు బంగారంతో అనుబంధం ఎంతో ప్రత్యేకం. ఆభరణాలు, బంగారంతో చేసిన వస్తువులు.. ఇలా ఏదో ఒక రూపంలో బంగారం కలిగి ఉండడాన్ని హోదాగానూ చూస్తారు. బంగారాన్ని సంపదగా భావిస్తుంటారు. అందుకే సామాన్యుడి కుటుంబంలోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఇదే బంగారం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు మరో రూపంలో ఆదుకుంటోంది.

ఆదాయాలు పడిపోయి, ఉపాధి కరువైన వేళ బంగారంపై సులభంగా రుణాలు పొందే పరిస్థితి వారికి కొంత ఊరటనిస్తోంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) సైతం బంగారం రుణాలు ఆమోదనీయంగా ఉంటున్నాయి. రుణ గ్రహీతలు చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో వారు తనఖాగా ఉంచిన బంగారాన్ని వేలం వేసుకునే సౌలభ్యం వాటికి ఉంటుంది. కనుక రిస్క్‌ తక్కువ. రుణ గ్రహీతలకూ తక్కువ రేటుపైనే రుణాలు లభించే పరిస్థితి. వెరసి ఇరువురికీ ఆమోదనీయమైన బంగారం రుణాల మార్కెట్‌ భారీగా విస్తరిస్తోంది.

కరోనా మహమ్మారి రాకతో బంగారం రుణ మార్కెట్‌ 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధిని చూసిందని చెప్పుకోవాలి. ఆర్‌బీఐ గణాంకాలను పరిశీలించినట్టయితే.. బ్యాంకుల రుణ పుస్తకంలో 2020 మార్చి నాటికి రూ.33,303 కోట్లుగా ఉన్న బంగారం రుణాలు.. 2021 మార్చి నాటికి ఏకంగా 86 శాతం పెరిగి రూ.60,464 కోట్లకు విస్తరించాయి. 2019 మార్చి నుంచి 2020 మార్చి మధ్యన చూసినా కానీ బ్యాంకుల బంగారం రుణాలు 33.9 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఇవి కేవలం ఆర్‌బీఐ వద్దనున్న బ్యాంకుల రుణ పుస్తకాల్లోని గణాంకాలే. ప్రత్యేకంగా బంగారం రుణాలను మంజూరు చేసే ముత్తూట్, మణప్పురం ఇతర ఎన్‌బీఎఫ్‌సీల పరిధిలోని గణాంకాలనూ కలిపి చూస్తే ఈ వృద్ధి మరింత ఎక్కవగానే ఉంటుంది.

కరోనా కష్టాల్లో ఆసరా..
బంగారం రుణాల మార్కెట్‌ ఏటేటా భారీ వృద్ధినే నమోదు చేస్తోంది. ఇందుకు పెరిగిన బంగారం ధరలు రూపంలో అనుకూలత ఏర్పడింది. ఇక 2020 మార్చిలో కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌లు విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధిని కోల్పోగా.. కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తీసుకున్న రుణాలపై ఆరు నెలల మారటోరియంను బ్యాంకులు కల్పించాయి.

గతేడాది ఆగస్ట్‌లో మారటోరియం ముగిసిన తర్వాత వ్యాపార కార్యకలాపాల కోసం ఈ బంగారం రుణాలే చాలా పరిశ్రమలను, వ్యాపారులను ఆదుకున్నాయి. అదే సమయంలో ఆర్‌బీఐ సైతం బంగారం రుణాల విషయంలో నిబంధనలను సడలించి ఆశలు కలి్పంచింది. లోన్‌ టు వ్యాల్యూ (అంటే బంగారం విలువలో మంజూరు చేసే రుణం పరిమాణం/ఎల్‌టీవీ)ను పెంచుతూ 2020 ఆగస్ట్‌లో ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాల కోసం మంజూరు చేసే బంగారం రుణాలకు ఎల్‌టీవీని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచింది.  

ప్రభుత్వ బ్యాంకుల పాత్ర
బంగారం ఆభరణాలు, వస్తువుల తాకట్టుపై ఎస్‌బీఐ మంజూరు చేసిన రుణాలు (సాధారణ అవసరాల కోసం ఇచ్చినవి) మార్చి 31 నాటికి ఏడాది కాలంలో ఏకంగా 465 శాతం పెరిగి రూ.20,987 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వి రూ.3,715 కోట్లుగానే ఉండడం గమనార్హం. బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర రిటైల్‌ బంగారం రుణాలు 2021 మార్చి నాటికి రూ.1,370 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవతత్సరంలో 11 రెట్ల వృద్ధి నమోదైంది. బ్యాంకు ఆఫ్‌ బరోడా రిటైల్‌ బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో కూడా 2020 మార్చి నాటికి ఉన్న రూ.436 కోట్ల నుంచి.. 2021 మార్చి నాటికి రూ.1,101 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటురంగంలోని ఫెడరల్‌ బ్యాం కు 70 శాతం, సీఎస్‌బీ బ్యాంకు 61 శాతం మేర బంగారం రుణాల్లో ప్రగతిని చూపించాయి.  

లిక్విడిటీ ఎక్కువ..
బంగారం రుణాలకు సంబంధించి పూర్తి సామర్థ్యాలను గతంలో తమ బ్యాంకు చూడలేదని బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ, సీఈవో రాజీవ్‌ ఎండీ పేర్కొన్నారు. దీంతో బంగారం రుణాల్లో మార్కెట్‌ను పెంచుకునేందుకు సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో, కస్టమర్లకు అనుకూలమైన పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. ‘‘క్లిష్ట సమయాల్లో చాలా మంది వ్యక్తులు, చిన్న వ్యాపారస్థులు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. తక్షణ నిధుల అవసరాలను బంగారం రుణాలు తీరుస్తున్నాయి. మా బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో 2021 మార్చి నాటికి రూ.1,939 కోట్లకు పెరిగింది.

అంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ఏడు రెట్ల వృద్ధి నమోదైంది. ఇప్పటికైతే బంగారం రుణ పుస్తకం రూ.2,100 కోట్లుగా ఉంటుంది’’ అని రాజీవ్‌ బంగారం రుణాల విస్తృతి గురించి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో రూ.5,000 కోట్లకు విస్తరిస్తుందని అంచనా వ్యక్తం చేశారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన తమ రుణ పుస్తకంలో ఎక్కువ వృద్ధి బంగారం రుణాల విభాగం నుంచే ఉన్నట్టు సీఎస్‌బీ బ్యాంకు ఎండీ, సీఈవో రాజేంద్రన్‌ సైతం ఇటీవలే పేర్కొనడం గమనార్హం. 76 శాతం వృద్ధి బంగారం రుణాల నుంచే వచ్చినట్టు చెప్పారు.

‘‘బంగారం రుణాల్లో వృద్ధి ఎంతో బాగుంది. ఎందుకంటే ఎన్‌బీఎఫ్‌సీలు ఈ విభాగంలో అంత  చురుగ్గా లేవు. ఒక్క సారి కస్టమర్‌ ఎన్‌బీఎఫ్‌సీ నుంచి బ్యాంకుకు బంగారం రుణం కోసం వస్తే.. ఇక తిరిగి ఎప్పటికీ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల వద్దకు వెళ్లరు. ఎందుకంటే చాలా ఆకర్షణీయమైన వడ్డీ రేటుకే బ్యాంకులో బంగారంపై రుణాలు లభిస్తాయి’’ అంటూ బంగారం రుణాలకు సంబంధించి బ్యాంకులు మంచి ఎంపిక అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగారం రుణాలు సురక్షితమైనవి (సెక్యూర్డ్‌ లోన్స్‌). డిఫాల్ట్‌ (రుణ ఎగవేతలు) రిస్క్‌ చాలా తక్కువ. దీంతో బ్యాంకులకు బంగారం రుణాలు ఆకర్షణీయంగా మారాయి.

పెరిగిన ధరలతో అధిక రుణం
ఒకవైపు అధిక ఎల్‌టీవీ, మరోవైపు పెరిగిన బంగారం మార్కెట్‌ ధరలు.. తనఖా బంగారంపై ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే పరిస్థితికి దారితీశాయి. మరోవైపు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు సైతం ఎక్కువ మందికి బంగారంపై రుణాలు అనుకూల మార్గంగా తోచాయి. ప్రభుత్వరంగంలోని బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర అయితే 7.35 శాతం, ఎస్‌బీఐ 7.50 వార్షిక వడ్డీ రేటుపై బంగారం రుణాలను ఆఫర్‌ చేస్తున్నాయి. సాధారణంగా బంగారం రుణాల మార్కెట్‌ను అధిక శాతం ముత్తూట్‌ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్‌ సంస్థలే శాసిస్తుంటాయి.

కానీ, ఆకర్షణీయమైన రుణ రేట్లతో ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం ఈ మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోతున్నాయి. దీంతో వినియోగదారులు కష్ట సమయాల్లో తక్కువ రేటుపైనే రుణాలు పొందే సౌలభ్యం ఏర్పడింది. నిజానికి ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలైన ముత్తూట్, మణప్పురం సంస్థలు బంగారం రుణాలపై అధిక రేట్లను వసూలు చేస్తుంటాయి. ప్రకటనల్లోనే 12 శాతం వడ్డీ రేటు అని చెబుతాయి కానీ.. ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా రూ.30వేలకు మించి ఈ రేటుపై రుణాలను ఇవ్వవు. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే 18, 24 శాతం వడ్డీ రేటును చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. కానీ, బ్యాంకుల్లో 60 పైసల వడ్డీ రేటుకే బంగారంపై రుణాలు లభిస్తున్నాయి. ఇక్కడ కాల వ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఎన్‌బీఎఫ్‌సీలు మూడు నెలలు, ఆరు నెలలకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీని ప్రతీ నెలకోసారి చెల్లించుకోవాలి. లేదంటే దానిపై మరింత చార్జీలను బాదుతాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అలా కాదు. ఏడాది, రెండేళ్లకూ రుణాలను ఇవ్వడమే కాకుండా.. వడ్డీని ఏడాదికోసారి చెల్లించే విధంగా పథకాలను రూపొందిస్తున్నాయి. కాకపోతే కాలవ్యవధి తీరిన తర్వాత వడ్డీ మాత్రమే చెల్లించి రుణాలను రెన్యువల్‌ చేసుకోవాలంటే ప్రక్రియను మొదటి నుంచి బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీంతో తిరిగి బంగారం అప్రైజర్‌ (విలువ మదింపుదారు) చార్జీలు, స్టాంప్‌ డ్యూటీ, జీఎస్‌టీ చార్జీల రూపంలో భారాన్ని భరించాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top