ఇండియాలో అక్కడ నివాసం చాలా కాస్ట్లీ - హైదరాబాద్ స్థానం ఏంటంటే?

Mumbai is the most expensive city for expats india - Sakshi

హైదరాబాద్‌లో సగమే వ్యయం

ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన పట్టణం హాంగ్‌కాంగ్‌

మెర్సర్‌ 2023 నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: ప్రవాసులకు భారత్‌లో నివాస వ్యయాల పరంగా ముంబై ఖరీదైన పట్టణంగా ఉన్నట్టు మెర్సర్‌ 2023 జీవన వ్యయ సర్వే నివేదిక వెల్లడించింది. ముంబై తర్వాత ఖరీదైన పట్టణాలుగా న్యూఢిల్లీ, బెంగళూరు నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే ముంబై ర్యాంక్‌ (నివాస వ్యయాల పరంగా) 147గా ఉంది. న్యూఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్‌ 202, కోల్‌కతా 211, పుణె 213 ర్యాంకులతో ఉన్నాయి. ముంబైతో పోలిస్తే హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా పుణెలో ప్రవాసులకు వసతి వ్యయాలు సగమే ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దేశంలో కోల్‌కతా అతి తక్కువ వ్యయాలతో ఉన్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలను సర్వే చేసి మెర్సర్స్‌ ఈ నివేదికలో ర్యాంకులు కేటాయించింది.

అంతర్జాతీయంగా హాంగ్‌కాంగ్, సింగపూర్, జ్యూరిచ్‌ ప్రవాస ఉద్యోగులకు అత్యంత ఖరీదైన పట్టణాలుగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అతి తక్కువ వ్యయాలతో కూడిన పట్టణాలుగా హవానా, కరాచీ, ఇస్లామాబాద్‌ ఉన్నాయి. నివాసం, రవాణా, ఆహారం, వస్త్రాలు, ఇంటి వస్తువులు, వినోదానికి అయ్యే ఖర్చు ఇలా 200 వస్తువులకు అయ్యే వ్యయాల ఆధారంగా మెర్సర్‌ ఈ అంచనాలను రూపొందించింది. ఇతర ప్రాంతాల్లో కరెన్సీ విలువల్లో అస్థిరతలు, వస్తు సేవల ధరలపై ద్రవ్యోల్బణ ప్రభావం వంటివి భారత పట్టణాల ర్యాంకులు దిగువకు మారేలా కారణమైనట్టు మెర్సర్‌ ఇండియా మొబిలిటీ లీడర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు.

(ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్‌ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు)

ఢిల్లీ, ముంబై అనుకూలం
బహుళజాతి సంస్థలు విదేశాల్లో కార్యకలాపాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఢిల్లీ, ముంబై వ్యయాల పరంగా అనుకూలమైన వేదికలుగా ఉన్నట్టు మెర్సర్‌ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇక్కడ నివాస వ్యయాలు తక్కువగా ఉన్నట్టు పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top