కరోనా : లక్ష కోట్ల అంబానీ సంపద ఆవిరి

Mukesh Ambani Loses usd 7 Billion As Oil Sinks Reliance Shares - Sakshi

ముకేశ్‌ అంబానీ ఆస్తి లక్ష కోట్లు ఆవిరి

6 నుంచి 9వ ప్లేసుకు రిలయన్స్ అధినేత

సాక్షి,ముంబై: ఆసియా అపర కుబేరుడు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద దారుణ పతనాన్ని నమోదు చేసింది. త్రైమాసిక లాభం క్షీణించడంతో రిలయన్స్‌ షేరు భారీగా నష్ట పోయింది. ఏడు నెలల్లో లేనంతగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు అత్యధికంగా పడిపోవడంతో అంబానీ నికర విలువ దాదాపు 7 బిలియన్ డాలర్ల సంపద ఆవిరై పోయింది.  అంబానీ నెట్‌వర్త్‌ రూ.13.52 లక్షల కోట్ల నుంచి రూ.12.69 లక్షల కోట్లకు పడిపోయింది.

సోమవారం ఆర్‌ఐఎల్‌ దాదాపు 8.6శాతం నష్టపోయి 1877.45 వద్ద ముగిసింది దీంతో అంబానీ ఆస్తి కూడా 6.8 బిలియన్ డాలర్లు తగ్గింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్‌ అంబానీ 71.5 బిలియన్ డాలర్లు. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో ఉన్న అంబానీ ప్రస్తుతం 9వ స్థానానికి పరిమితం అయ్యారు.  మంగళవారం నాటి  మార్కెట్లో కూడా రిలయన్స్ షేరు నష్టాలతోనే కొనసాగుతోంది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంధన డిమాండ్‌ భారీగా పడిపోవడంతో రిలయన్స్‌ లాభాలను ప్రభావితం చేసింది. కీలకమైన చమురు, రసాయనాల విభాగం ఆదాయాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనికర లాభం తగ్గింది. 15 శాతం క్షీణించి 9,570 కోట్ల రూపాయలుగా (1.3 బిలియన్ డాలర్లు) నమోదైంది. ఆదాయం 24 శాతం పడిపోయి 1.16 లక్షల కోట్లకు చేరుకుంది. కరోనావైరస్‌కు  ఇంకా టీకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల వైరస్‌ వ్యాప్తి, రెండవసారి లాక్‌డౌన్‌ ఆందోళనల మధ్య పెట్రోకెమికల్‌ వ్యాపారం  ఎప్పటికి పుంజుకుంటుందో తెలియని అనిశ్చితి  ఏర్పడింది.

కాగా ఇటీవల రిలయన్స్‌ జియో, రీటైల్‌ విభాగంలో దిగ్గజసంస్థల నుంచి పెట్టుబడుల వెల్లువ కురిసింది.  దాదాపు 25 బిలియన​ డాలర్లకు పైగా పెట్టుబడులను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇన్వెస్టర్లు రిలయన్స్​ షేర్లలో పెట్టుబడులకు మొగ్గారు.  ఫలితంగా షేర్లు ఈ సంవత్సరం 25 శాతం ర్యాలీ అయ్యాయి. అయితే సెన్సెక్స్ 3.6శాతం పడిపోవడం గమనార్హం. తాజాగా ఫ్యూచర్ రిటైల్ ఒప్పందానికి సంబంధించి అమెజాన్‌తో వివాదాలు, పెట్రోలియం విభాగంలో సౌదీ కంపెనీ ఆరామ్‌కో ఒప్పందం ఆలస్యం తదితర కారణాల రీత్యా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top