
చెప్పులు లేకుండా సైకిల్ తొక్కడం, హెలికాఫ్టర్లలో నుంచి కిందికి దూకడం, బుర్జ్ ఖలీఫా ఎక్కడం, మోటార్ సైకిల్‌తో కొండపై నుంచి దూకడం వంటి స్టంట్స్ చేస్తూ.. ఎంతోమంది ప్రేక్షలకుల మనసు కొల్లగొట్టిన హాలీవుడ్ స్టార్ 'టామ్ క్రూజ్' ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే వారిలో ఒకరు. ఇంతకీ ఈయన నెట్‍వర్త్ ఎంత అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆరు పదుల వయసు దాటినా.. తన నటనతో దూసుకెళ్తున్న టామ్ క్రూజ్.. 'మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రికనింగ్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. 2025లో విడుదలైన హాలీవుడ్ సినిమాల్లో మొదటి రోజే ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాల్లో ఇదే మొదటిస్థానంలో నిలిచింది.
టామ్ క్రూజ్ నికర విలువ
అత్యంత సంపన్న నటులలో ఒకరిగా నిలిచిన టామ్ క్రూజ్ నికర విలువ.. పరేడ్ మ్యాగజైన్ ప్రకారం సుమారు 600 మిలియన్ డాలర్లు (రూ. 51.36 కోట్ల కంటే ఎక్కువ). సినిమాల్లో నటించడం ద్వారా మాత్రమే కాకుండా.. ఈయన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కూడా సంపాదిస్తున్నారు.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా టామ్ క్రూజ్ సుమారు 100 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ది మ్యూజిక్ ఎసెన్షియల్స్ తెలిపింది. అంతే కాకుండా ఈయనకు సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. రికార్డింగ్ స్టూడియోలో 30 శాతం వాటాను కలిగి ఉన్నారు. సైంటాలజీ సంబంధిత వెంచర్లలో కూడా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'
రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో విషయానికి వస్తే.. టామ్ క్రూజ్ బెవర్లీ హిల్స్‌లో నివాసాన్ని 2007లో కొనుగోలు చేశారు. ఆ తరువాత 2021లో తన 10,000 చదరపు అడుగుల కొలరాడో భవనాన్ని 40 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2015లో క్రూజ్ లండన్ సమీపంలోని 14 ఎకరాల ఎస్టేట్‌ను 7.3 మిలియన్ డాలర్లకు విక్రయించి.. హాలీవుడ్ కాంపౌండ్‌లోని నివాసాన్ని 12 మిలియన్ల రెసిడెన్సీ కొనుగోలు చేశారు.