హైదరాబాద్‌లో మైక్రోచిప్‌ ఆఫీసు   | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మైక్రోచిప్‌ ఆఫీసు  

Published Fri, Jan 20 2023 3:53 PM

Microchip Tech buys office space in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కార్యాలయ స్థలాల లావాదేవీలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ ఆఫీసు స్పేస్‌ను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన సెమీకండకర్ల తయారీ కంపెనీ మైక్రోచిప్‌ టెక్నాలజీ కోకాపేటలోని వన్‌ గోల్డెన్‌ మైల్‌ టవర్‌లో 1.68 లక్షల చదరపు అడుగుల గ్రేడ్‌-ఏ ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్‌ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీలకు కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సలహాదారుగా వ్యవహరించింది.

అమెరికాలోని ఆరిజోనా ప్రధాన కేంద్రంగా ఉన్న మైక్రోచిప్‌కు మన దేశంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నైలలో డెవలప్‌మెంట్‌ సెంటర్లున్నాయి. తాజా పెట్టుబడులు వచ్చే 10 ఏళ్లలో కంపెనీ సామర్థ్యాల విస్తరణ, నియామకాలు, అభివృద్ధి ప్రణాళికలకు సరిపోతాయని మైక్రోచిప్‌ టెక్నాలజీ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్, ఎండీ శ్రీకాంత్‌ శెట్టికెరె అన్నారు.

66 మీటర్ల ఎత్తయిన వాణిజ్య సముదాయంలో సుమారు 5 లక్షల చ.అ. గ్రేడ్‌-ఏ ఆఫీసు స్థలం ఉంది. ఆరియన్, ఎస్కార్, టెర్మినస్‌లు ఈ ప్రాపర్టీని కో-ప్రమోటర్లుగా ఉన్నాయి. యూఎస్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (యూఎస్‌జీబీసీ) నుంచి ఎల్‌ఈఈడీ గోల్డ్‌ రేటింగ్‌ సర్టిఫికెట్‌ను దక్కించుకుందని వన్‌ గోల్డెన్‌ మైల్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పుష్కిన్‌ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్ధిక మాంద్యం, లేఆఫ్‌లు వంటి వ్యాపార ఒత్తిడి నేపథ్యంలోనూ హైదరాబాద్‌లో ప్రీమియం ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరగడం సానుకూల దృక్పథమని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ హైదరాబాద్‌ ఎండీ వీరాబాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement