MEIL: ఐపీవో యోచనలో మేఘా ఇంజనీరింగ్‌

Megha Engineering and Infrastructures Limited looking for ipo - Sakshi

శ్రీనగర్‌ నుంచి సాక్షి ప్రతినిధి ఎన్‌. పార్థసారథి: ఇన్‌ఫ్రా రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకి రావాలనే యోచనలో ఉంది. అలాగే మరిన్ని కొత్త టెక్నాలజీలను కూడా దేశీయంగా అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతోంది. ఎంఈఐఎల్‌ ఎండీ పి.వి. కృష్ణారెడ్డి ఈ విషయాలు తెలిపారు. అయితే, ఎప్పట్లోగా ఐపీవోకి రానున్నది, ఎంత మేర నిధులు సమీకరించనున్నది ఆయన వెల్లడించలేదు. మరోవైపు, హైడ్రోజన్‌ సంబంధ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇటాలియన్‌ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. ఇటీవలే అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని వివరించారు. 

కొత్త తరహా సాంకేతికతలపై సుమారు రూ. 15–20 వేల కోట్ల దాకా ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘మేము ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బస్సులు, ఆటోల్లాంటివి తయారు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఎలక్ట్రిక్‌ బస్సులు నిర్వహిస్తున్నాం. అలాగే ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌ రిగ్గుల తయారీ,  ఎక్స్‌ప్రెస్‌ వేస్, విద్యుత్‌ పంపిణీ తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం‘ అని కృష్ణారెడ్డి వివరించారు. అటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా తదితర ఖండాల్లో 18 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. 

డిజిన్వెస్ట్‌మెంట్‌ సంస్థలపై ఆసక్తి.. 
కేంద్ర పభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా వాటాలు విక్రయిస్తున్న సంస్థలను దక్కించుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు కృష్ణారెడ్డి చెప్పారు. బీఈఎంఎల్, షిప్పింగ్‌ కార్పొరేషన్, నీలాచల్‌ ఇస్పాత్‌ వంటి సంస్థల విషయంలో అర్హత కూడా సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లకు సంబంధించి అవసరాన్ని బట్టి ఏడాది, రెండేళ్ల వ్యవధిలో రూ. 15,000–20,000 కోట్ల దాకా నిధులు సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పా రు. విదేశాల నుంచి సమీకరించే నిధులను భారత్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తామని, విదేశాల్లో ఇన్వెస్ట్‌ చేసే యోచనేదీ తమకు లేదని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

డెడ్‌లైన్‌ కన్నా ముందే జోజిలా టన్నెల్‌ పూర్తి..
శ్రీనగర్‌–లేహ్‌ మధ్యలో నిర్మిస్తున్న వ్యూహాత్మక జోజిలా టన్నెల్‌ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువు కన్నా  ముందే పూర్తి చేస్తామని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధితో స్థానికంగా ఉపాధి కల్పనకు, పర్యాటక రంగానికి ఊతం లభించగలదని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో టన్నెల్‌ ప్రాజెక్టుల అనుభవంతో, కాంపిటీటివ్‌గా బిడ్‌ చేసి జోజిలా ప్రాజెక్టు దక్కించుకున్నామని ఆయన వివరించారు.

ప్రస్తుతం తమ సంస్థలో 35,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని, వివిధ ప్రాజెక్టుల్లో మూడు లక్షల మంది దాకా పనిచేస్తున్నారని కృష్ణారెడ్డి వివరించారు. తమ ప్రాజెక్టుల అవసరాలకు సంబంధించి చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుండటం ద్వారా వాటికి కూడా తోడ్పాటు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు.

చదవండి: ఒలెక్ట్రాకు మరో 150 బస్‌ల ఆర్డర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top