11 లక్షల వర్తకులతో మీషో

Meesho crosses 11 lakh sellers on its platform - Sakshi

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ కంపెనీ మీషో వేదికపై వర్తకుల సంఖ్య 11 లక్షలు దాటింది. గడిచిన ఏడాదిలో 6 లక్షల పైచిలుకు చిన్న వర్తకులు చేరారని కంపెనీ ప్రకటించింది. ఎనమిదేళ్లలోనే ఈ మైలురాయికి చేరుకున్నట్టు తెలిపింది. ‘విక్రేతల్లో సగం మంది ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారు ఉన్నారు. మొత్తం సెల్లర్స్‌లో 80 శాతం పైచిలుకు మంది ఈ–కామర్స్‌కు కొత్తగా చేరినవారే. మీషో ద్వారానే ఆన్‌లైన్‌ వ్యాపారంలోకి వీరు అడుగుపెట్టారు.

కశ్మీర్‌లోని పుల్వామా, హిమాచల్‌ ప్రదేశ్‌ ఉనా, కర్ణాటక నాగమంగళ, మేఘాలయ జోవాయ్, రాజస్తాన్‌లోని మౌంట్‌ అబు నుంచి సైతం విక్రేతలు నమోదయ్యారు. ఇంటర్నెట్‌ వాణిజ్యాన్ని మారుమూల ప్రాంతాలకూ చేర్చడం, చిన్న అమ్మకందారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలన్న సంస్థ లక్ష్యానికి ఇది నిదర్శనం’ అని మీషో వివరించింది. వార్షిక ప్రాతిపదికన 14 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు 2022లో కంపెనీ ప్రకటించింది. విక్రేతల సగటు ఆదాయం మూడింతలు పెరిగిందని తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top