చమురు ధరలు తగ్గడం ఓఎంసీలకు అనుకూలం

Marketing losses of India oil PSUs to ease says Moodys - Sakshi

మార్జిన్లు మెరుగుపడతాయి

2023–24పై మూడీస్‌ అంచనాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలహీనమే

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద బలహీన ఆర్థిక ఫలితాలనే నమోదు చేస్తాయని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ.. విక్రయ ధరలను చాలా కాలంగా నిలిపి ఉంచడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్థిక మందగమనం ఆందోళనలతో చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడం వల్ల మూడు ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల బాట పడతాయని అంచనా వేసింది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నష్టాలు వచ్చినందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు బలహీనంగానే ఉంటాయి.

చమురు విక్రయ ధరలపై పరిమితి పెట్టినందున మొదటి ఆరు నెలల్లో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి రేట్లను సవరించలేదు’’అని మూడీస్‌ పేర్కొంది. ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్‌ 6 నుంచి చమురు విక్రయ ధరలను సవరించకుండా, అవే ధరలను కొనసాగిస్తుండడం గమనార్హం. 2022 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి ధరలను సవరించకపోవడం వల్ల, మొదటి ఆరు నెలలకు రూ.21,000 నష్టాలను ప్రకటించాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా.. డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్షీణించడం వీటి నష్టాలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. ఇవి ముడి చమురును డాలర్‌ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయని మూడీస్‌ తెలిపింది.  

లాభాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే చమురు ధరలు తగ్గినందున, కొనుగోళ్ల వ్య యాలు తగ్గి లాభదాయక వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడుతుందని మూడీస్‌ అంచనా వేసింది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేయడం ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కలిసొస్తుందని పేర్కొంది. బ్రెంట్‌ క్రూడ్‌ కంటే రష్యా చమురు త క్కువ ధరకు వస్తుండడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ వచ్చే 12నెలల్లో చమురు ధరలు అస్థిరతల మధ్యే చలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రతరమైనా లేక చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, అదే జరిగితే ఆయిల్‌ కంపెనీల లాభాలు పరిమితం కావొచ్చని పేర్కొంది.  

రుణ పరిస్థితుల్లో మెరుగు..
‘‘లాభాలు పెరిగితే రుణ భారం తగ్గుతుంది. మూ లధన అవసరాలకు నిధుల వెసులుబాటు లభిస్తుంది. 2022 మార్చి నుంచి సెప్టెంబర్‌ మధ్య నష్టాలను అదనపు రుణాలు తీసుకుని ఇవి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో వాటి రుణ భారం పెరిగింది’’అని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ పే ర్కొంది. పెరిగే ధరలకు అనుగుణంగా మూలధన అవసరాలు కూడా పెరుగుతాయని, ఫలితంగా కంపెనీల రుణ కొలమానాలు బలహీనంగా ఉంటా యని పేర్కొంది. నియంత్రణపరమైన అనిశ్చితి కూ డా వాటి రుణ నాణ్యతను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘‘భారత్‌లో చమురు ధరల పరంగా స్ప ష్టత లోపించింది. రిఫైనింగ్, మార్కెటింగ్‌ కంపెనీలకు ఇది క్రెడిట్‌ నెగెటివ్‌. చమురు ధరలపై నియంత్రణలతో కంపెనీల నష్టాలు కొనసాగుతా యి. వాటిని ప్రభుత్వం సకాలంలో సర్దుబాటు చే యకపోతే వాటి క్రెడిట్‌ నాణ్యత కూడా బలహీనపడుతుంది’’ ఈని మూడిస్‌ నివేదిక హెచ్చరించింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు దృష్ట్యా ఈ కంపెనీల తుది రేటింగ్‌ల్లో ఏ మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది.  

రేట్లపై స్వేచ్ఛ లభిస్తేనే..
చమురు రిఫైనింగ్, మార్కెటింగ్‌ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్‌ విక్రయ రేట్లను సవరించుకునే స్వేచ్ఛ కల్పించినప్పుడే వాటి మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని మూడీస్‌ తెలిపింది. అయితే ఇది 2024 సాధారణ ఎన్నికల తర్వాతే సాధ్యపడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇటీవల అంతర్జాతీయంగా రేట్లు తగ్గడం కంపెనీలకు సానుకూలిస్తుందని పేర్కొంది. ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగతే వచ్చే కొన్ని నెలల్లో కంపెనీల లాభదాయకత పెరుగుతుందని మూడీస్‌ తెలిపింది. ‘‘2022–23లో సెప్టెంబర్‌ 30 నాటికి సగటున చమురు ధర బ్యారెల్‌ 105 డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి డిసెంబర్‌ 31 నాటికి 16 శాతం తగ్గి బ్యారెల్‌ 89 డాలర్లకు దిగొచ్చింది’’ అని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top