అలుపులేని మార్కెట్లు- రికార్డ్స్‌ నమోదు 

Market achieved new record highs - Sakshi

259 పాయింట్లు ప్లస్‌- 47,613కు సెన్సెక్స్‌

59 పాయింట్లు ఎగసి 13,933 వద్ద నిలిచిన నిఫ్టీ

20 సెషన్లలో 14సార్లు సరికొత్త గరిష్టాలకు

బ్యాంకింగ్‌, ఐటీ అప్‌- మీడియా, ఆటో, ఫార్మా వీక్‌‌

ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి జోరు చూపాయి. సెన్సెక్స్‌ 259 పాయింట్లు జంప్‌చేసి 47,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 13,933 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్‌ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! ప్రెసిడెంట్ ట్రంప్ 2.3 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు 0.7 శాతం బలపడ్డాయి. తద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక కోవిడ్‌-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 47,714 వద్ద, నిఫ్టీ 13,967 వద్ద చరిత్రాత్మక రికార్డులను అందుకున్నాయి.  

రియల్టీ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, ఐటీ రంగాలు 1.5-0.8 శాతం మధ్య బలపడగా.. మీడియా, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ 1.5-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐటీసీ, గెయిల్‌ 6-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో హిందాల్కో, నెస్లే, కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఆర్‌ఐఎల్‌, సిప్లా 2-1 శాతం మధ్య నీరసించాయి.

ఐజీఎల్‌ జూమ్‌ 
డెరివేటివ్‌ స్టాక్స్‌లో ఐజీఎల్‌, జీఎంఆర్‌, ఎక్సైడ్‌, ఎంజీఎల్‌, పీఎన్‌బీ, ఎస్కార్ట్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌, అపోలో టైర్‌, నౌకరీ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు జిందాల్‌ స్టీల్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, వేదాంతా, క్యాడిలా హెల్త్‌, ఎన్‌ఎండీసీ, మెక్‌డోవెల్‌, పిరమల్‌ 3- 1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్స్‌ 0.15 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,559 లాభపడగా.. 1,464 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. డీఐఐలు మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top